యాప్నగరం

‘మళ్లీ పెళ్లిచేస్తే సత్తా చాటుతాడట కేసీఆర్’

అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తుకు వెళ్తున్న కేసీఆర్‌ తీరుపై సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 7 Sep 2018, 4:46 pm
తెలంగాణ శాసనసభ రద్దు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను ఢిల్లీకి రావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై రజత్‌ కుమార్‌తో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. టీఆర్ఎస్ ముందస్తుకు హుస్నాబాద్ లో సభ నిర్వహిస్తుండగా.. విపక్షాలు మాత్రం కేసీఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. న్యూఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్ణయం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. తన పరిపాలనపై అంత నమ్మకం ఉన్న వ్యక్తి ప్రజలకు మరికొన్ని నెలల పాలనను దూరం చేశారని విమర్శించారు.
Samayam Telugu Narayana And suravaram sudhakar reddy


టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోతున్న నేపథ్యంలోనే కేసీఆర్‌ లక్ష్మణ రేఖ దాటారని పేర్కొన్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్‌ తీరు చూస్తుంటే.. శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన నవ వరుడి మాదిరిగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఆపై ‘ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేస్తే.. సత్తా చాటుతా అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ అనవసరంగా హడావుడి చేస్తున్నారని’ నారాయణ ధ్వజమెత్తారు. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ వ్యవహార శైలిపై ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి అసంతృప్తిగా ఉన్నట్లు సీపీఐ నేత వెల్లడించారు.

ప్రతిపక్ష నేతలను నీచంగా సంబోధిస్తూ మాట్లాడే సంస్కారం కేసీఆర్‌ సొంతమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. సురవరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల కమిషన్‌ను ఆదేశించేలా కేసీఆర్‌ ప్రవర్తిస్తున్నారు. చివరికి ఎన్నికల షెడ్యూల్‌ని సైతం కేసీఆర్‌ ప్రకటించేలా ఉన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్‌ను సైతం ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల తేదీల లాంటివి కేసీఆర్‌ ప్రకటించడాన్ని మేం ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొచ్చాం. వారు సానుకూలంగానే స్పందించారు. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ చెబుతున్నా.. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. పొలిట్‌బ్యూరోతో చర్చించకుండానే ఏకమొత్తంగా 105 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేయడం అందులో భాగమని’ సురవరం వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.