యాప్నగరం

వీడియో: బాబోయ్ తిత్లీ.. భారీ ట్రక్కులే తిరగబడ్డాయి!

తిత్లీ తుఫాన్ ఏపీలో బీభత్సం చేస్తోంది. భయంకరమైన గాలులకు ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. భారీ ట్రక్కులే తిరగబడ్డాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

Samayam Telugu 11 Oct 2018, 11:36 pm
తిత్లీ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ పెను తుఫాన్ ధాటికి ఏపీలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 150 కి.మీ. వేగంతో పెను గాలులు వీచాయి. పెను గాలుల ధాటికి వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ గాలుల ధాటికి భారీ ట్రక్కులే పక్కకు ఒరిగాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. భయంకరమైన గాలుల ధాటికి భారీ ట్రక్కులు తిరగబడిన దృశ్యాలను వీడియోలో చూడవచ్చు.
Samayam Telugu titli


పెనుగాలు కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చాలాచోట్ల విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అనేక ప్రాంతాల్లో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. సిగ్నల్స్‌ వ్యవస్థ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లను దారి మళ్లించారు.


శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద తీరాన్ని తాకిన తుఫాన్.. పలాస - ఒడిశాలోని గజపతి జిల్లా మీదుగా తీరాన్ని దాటింది. తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో భారీ ఆస్తినష్టం సంభవించింది. మండలంలోని దోపులపాడు, గునుపల్లి, చిన్నవంక గ్రామాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఈదురుగాలుకు జీడిమామిడి, అరటి, కొబ్బరి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో అరటి, వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన రైతులు కంటతడి పెడుతున్నారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత చాలా సేపటి వరకు గంటకు 110 నుంచి 140 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి.


తిత్లీ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు, కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, మందస, నందిగామ, మేలియపుట్టి, సోంపేట తదితర మండలాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.

తుఫాన్ ప్రభావంతో సముద్ర అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. కాకినాడ, బరువా ప్రాంతాల్లో సముద్రంలో శుక్రవారం 8 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని 'ఇన్‌కాయిస్' తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.