యాప్నగరం

పార్టీ మారిన గంటల్లోనే వెనక్కి.. బీజేపీకి పద్మినీరెడ్డి ఝలక్

మహిళా నేత అనూహ్య నిర్ణయంతో బీజేపీ శ్రేణులు షాక్‌కు గురికాగా, కాంగ్రెస్ నేతలు మాత్రం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నట్లయింది.

Samayam Telugu 11 Oct 2018, 11:34 pm
కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకు షాకిస్తూ బీజేపీలో చేరిన ఆయన సతీమణి పద్మినీరెడ్డి సాయంత్రానికి మరో ట్విస్ట్ ఇచ్చారు. గురువారం ఉదయమే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో కాషాయం పార్టీలో చేరిన ఆమె కేవలం గంటల వ్యవధిలో పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు షాక్‌కు గురికాగా, కాంగ్రెస్ నేతలు మాత్రం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నట్లయింది.
Samayam Telugu Padmini Reddy


కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదన చూడలేక బీజేపీ నుంచి గంటల వ్యవధిలోనే తప్పుకుంటున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్లు పద్మినీ రెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి అంతలా స్పందన వస్తుందని ఊహించలేకపోయానని, అందుకే మనసు మార్చుకున్నట్లు చెప్పారు. అనుకోకుండా తాను తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను అంతలా బాధిస్తుందని అనుకోలేదన్నారు. (బీజేపీలో చేరిన రాజనర్సింహ సతీమణి.. ఏంటి వ్యూహం?)

అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న దామోదర రాజనరసింహ సతీమణి పద్మినీ రెడ్డికే పార్టీ మేనిఫెస్టో నచ్చలేదంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేశారు. కీలక నేత ఇంట్లోనే పార్టీ విధివిధానాలపై అంత అనాసక్తి ఉంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంతో అర్థమవుతుందంటూ గులాబీ నేతలు గురువారం రోజు ప్రచారం చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి లేక మెదక్ నుంచి పోటీ చేస్తారని తెరపైకి రావడం గమనార్హం. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరగగా.. అంతలోనే మరో ట్విస్ట్ ఇస్తూ ఆమె సొంతగూటి (కాంగ్రెస్)కి చేరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.