యాప్నగరం

దసరా విషాదం.. ఒక్కసారిగా కూలిన స్లాబ్

ఓవైపు అంతా దసరా సంబురాల్లో మునిగిపోయారు. డబ్బుల మోతతో అక్కడ అంతా కోలాహలంగా ఉంది.

TNN 30 Sep 2017, 8:45 am
ఓవైపు అంతా దసరా సంబురాల్లో మునిగిపోయారు. డబ్బుల మోతతో అక్కడ అంతా కోలాహలంగా ఉంది. కానీ ఇంతలోనే ప్రమాదం. మహిళలంతా ఒకేచోటుకి చేరి మేడమీద నుంది దసరా సంబురాలను చూస్తున్న సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. ఆ గ్రామంలో ఊహించని విషాదాన్ని మిగిల్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 17 మంది గాయపడ్డారు.
Samayam Telugu dasara celebrations turn tragic two killed and 17 injured
దసరా విషాదం.. ఒక్కసారిగా కూలిన స్లాబ్


దసరా పండుగకు ముందురోజు గ్రామంలో మల్లన్న గుడి వద్ద జంబి పూజలు చేయడం, గొర్రెను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయం ప్రకారం సాయంత్రం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. మల్లన్న గుడి సమీపంలో ఊరేగింపును చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. గుడికి పక్కనే ఉన్న గడీల మల్లుబాయికి చెందిన పాత ఇంటి మేడపై కొంతమంది మహిళలు నిల్చుని ఊరేగింపును తిలకిస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా పిట్టగోడతో పాటు స్లాబు కూలింది. ఆ సమయంలో కింద కూడా జనం ఉన్నారు. వారిపై ఈ స్లాబు పడింది.

వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పుట్ట హరిణి(8) అనే బాలిక చనిపోయింది. యశోద(25) అనే మహిళను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదంలో గాయపడిన 17 మందిని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్, హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.