యాప్నగరం

ఇదెక్కడి ‘కుట్ర’: గూగుల్‌లో కుట్ర అని టైప్ చేస్తే కేటీఆర్!

గూగుల్‌ ఇమేజెస్‌లో ‘కుట్ర’ అనే పదం టైప్ చేస్తే మంత్రి కేటీఆర్ ఫోటోలు వస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రంగా ఎంచుకుంది.

TNN 11 Feb 2018, 7:15 pm
గూగుల్‌ ఇమేజెస్‌లో ‘కుట్ర’ అనే పదం టైప్ చేస్తే మంత్రి కేటీఆర్ ఫోటోలు వస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రంగా ఎంచుకుంది. రాజకీయ కుట్రల్లో కేటీఆర్ తన వయసుకు మించి ఆరి తేరారని, అందుకే గూగుల్‌లో ‘కుట్ర’ అని సెర్చ్‌ చేస్తే ఆయన ఫోటోలు ప్రత్యక్షమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. కుట్ర అనే పదానికి కేటీఆర్ పర్యాయపదంగా ఉన్నట్లుందని ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu dasoju sravan hot comments on ktr over kutra
ఇదెక్కడి ‘కుట్ర’: గూగుల్‌లో కుట్ర అని టైప్ చేస్తే కేటీఆర్!


కేటీఆర్‌కు ఆదివారం (ఫిబ్రవరి 11) దాసోజు శ్రావణ్ ఓ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకుంటే.. మీరేమో ఇంటిల్లిపాదీ పదవులు అనుభవిస్తున్నారని కేసీఆర్‌ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేటీఆర్ కుటుంబానికి రాహుల్ కుటుంబానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని శ్రావణ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణ బిల్లుపై విచ్చలవిడిగా మాట్లాడుతుంటే విమర్శించాల్సింది పోయి మెప్పుకోలు కోసం పాకులాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

‘మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కేటీఆర్‌ తాకట్టు పెట్టారు. పార్లమెంటులో తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని అగౌరవపరిచేలా మోదీ మాట్లాడుతుంటే టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు. మోదీతో వారికున్న లోపాయికరి ఒప్పందం ఏంటో చెప్పాలి’ అని శ్రావణ్ ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.