యాప్నగరం

చింతమనేనిపై అనర్హత వేటు పడుతుందా?

మంత్రి అవుదామని అనుకున్న చింతమనేనికి పాత కేసు ఒకదాంట్లో శిక్ష ఖరారు కావడం పెద్ద షాకే.

TNN 15 Feb 2018, 11:31 am
కొన్ని నెలల కిందట జరిగిన ఏపీ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని ఆశించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అయితే బాబు అవకాశం ఇవ్వలేదు. అలా మంత్రి అవుదామని అనుకున్న చింతమనేనికి పాత కేసు ఒకదాంట్లో శిక్ష ఖరారు కావడం పెద్ద షాకే. 2011లో ‘రచ్చబండ’ సభలో నాటి మంత్రి పితాని సత్యనారాయణపై చింతమనేని చేయి చేసుకున్న కేసులో.. అందుకు సంబంధించిన నమోదైన సెక్షన్లతో..దోషిగా తేల్చింది భీమడోలు న్యాయస్థానం. ఈ కేసుల్లో చింతమనేనికి మొత్తం రెండు సంవత్సరాల శిక్ష ఖరారు అయ్యింది.
Samayam Telugu disqualification on chinthamaneni prabharkar
చింతమనేనిపై అనర్హత వేటు పడుతుందా?


ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా.. ఇలా దోషిగా తేలితే వారి చట్టసభ ప్రాతినిధ్యం రద్దు అవుతుంది. కేసులు నమోదు అయితే వారి పదవులకు ఇబ్బంది లేదు కానీ, ఆరోపణలు రుజువు అయ్యి.. శిక్ష ఖరారు అయితే.. వారిపై అనర్హత వేటు పడుతుంది. ఈ రకంగా చూస్తే.. చింతమనేని పై తక్షణం అనర్హత వేటు పడాలి. కానీ.. పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి.. చింతమనేనికి ఊరట దక్కినట్టే.

ఈ శిక్ష విషయంలో చింతమనేని హై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా శిక్ష ఖరారు అయితే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లవచ్చు. కిందికోర్టులో విచారణకే ఏడు సంవత్సరాలు పట్టింది.. పై కోర్టులో విచారణలకు మరెంతో కాలం పట్టవచ్చు. అంత వరకూ చింతమనేనికి పడిన శిక్ష సస్పెన్షన్లో ఉంటుంది. కాబట్టి.. ప్రస్తుతానికి అయితే ఆయన ఎమ్మెల్యే గా కొనసాగుతారు. వచ్చే ఎన్నికల నాటికి కూడా పై కోర్టుల నుంచి తీర్పులు రాని పక్షంలో మళ్లీ పోటీ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది.

అయితే.. ఈ కేసులో సాక్ష్యాలు బలంగానే ఉన్నాయని, పితానిపై చింతమనేని చేయి చేసుకోవడానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని అంటున్నారు. వాటి వల్లనే చింతమనేనికి శిక్ష ఖరారు అయ్యిందనే మాట వినిపిస్తోంది. తన దురుసైన తీరుతో ఇప్పటికే చింతమనేని అనేక మార్లు వార్తల్లోకి ఎక్కారు. ఆయనపై మొత్తం 46 కేసులు విచారణలో ఉండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.