యాప్నగరం

జనంలోకి ఐపీఎస్ లక్ష్మీనారాయణ.. రైతులతో భేటీ

ఉద్యోగానికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనం బాటపట్టారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన ఆయన... గుంటూరు జిల్లాలో రైతుల్ని కలిశారు.

Samayam Telugu 26 Apr 2018, 10:16 pm
ఉద్యోగానికి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనం బాటపట్టారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన ఆయన గుంటూరు జిల్లాలో రైతుల్ని కలిశారు. కర్లపాలెం మండలం యాజిలి వెళ్లిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. స్థానిక స్కూల్లో మొక్కలు నాటిన ఆయన.. ఆ తర్వాత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. వ్యవసాయ పద్దతులు, పంటలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటూ పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Samayam Telugu JD


సమాజంలో గొప్ప మనసున్న వ్యక్తి రైతన్నారు లక్ష్మీనారాయణ. ప్రభుత్వ ఉద్యోగులకు 6 నెలలకోసారి ఇంక్రిమెంట్లు ఉన్నట్లు.. రైతులకు కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. తాను గ్రామాల్లోనే పనిచేస్తానని ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశానని.. కానీ, తనకు ఆ అవకాశం రాలేదని తెలిపారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చానన్నారు. తానే వ్యవసాయ మంత్రినైతే రైతులకు ఏం చేయాలో ఆలోచిస్తానని ఆయన వివరించారు. అన్నదాతలకు సాయం అందించడానికే సోషల్ వర్కర్‌గా మారానని చెప్పారు.

ప్రత్యేక హోదాపైనా లక్ష్మీనారాయణ స్పందించారు. హోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. దీనిపై అధ్యయనం చేస్తున్నానని, త్వరలోనే తన అభిప్రాయాన్ని చెబుతానని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీపై మీడియా ప్రశ్నించగా.. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.

లక్ష్మీనారాయణ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జోరుగా సాగింది. బీజేపీలోకి వెళ్తారని కొన్ని రోజులు.. కాదు, జనసేనలోకి అంటూ మరోసారి ప్రచారం జరిగింది. కానీ, ఆయన మాత్రం త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అయితే.. ఉన్నట్టుండి ఇలా రైతులతో సమావేశం కావడంపై మాత్రం జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.