యాప్నగరం

మంత్రులుగా ప్రమాణం చేసిన ఫరూక్‌, శ్రావణ్‌

14 ఏళ్ల తర్వాత ఫరూక్‌ తిరిగి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

Samayam Telugu 11 Nov 2018, 12:38 pm
ఏపీ కేబినెట్ విస్తరణ ఆదివారం (నవంబరు 11) ఉదయం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గవర్నర్ నరసింహన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా శాసన మండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత కిడారి శ్రావణ్‌కుమార్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఫరూక్ తెలుగులో ప్రమాణం చేయగా, శ్రావణ్ ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. సీఎం చంద్రబాబు చేపట్టిన ఈ మంత్రివర్గ విస్తరణలో ముస్లీం మైనార్టీ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్‌లో ఫరూక్‌కు అవకాశం దక్కింది.
Samayam Telugu ap cabinet


విజయవాడలోని ప్రజావేదికలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 14 ఏళ్ల తర్వాత ఫరూక్‌ తిరిగి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు నక్సల్స్ దాడిలో చనిపోవడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌‌కుమార్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమంతోపాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖ కేటాయించే అవకాశం ఉంది. గిరిజన సంక్షేమశాఖను శ్రావణ్‌కు అప్పగించనున్నట్లు సమాచారం.

హరికృష్ణ తర్వాత శ్రావణే..కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిడారి శ్రావణ్‌కుమార్‌ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే నేరుగా మంత్రివర్గంలో స్థానం పొందారు. 1995లో నందమూరి హరికృష్ణ తర్వాత ఈ విధంగా అవకాశం లభించడం శ్రావణ్‌కే కావడం గమనార్హం. ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రివర్గంలో చేరితే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో అరకు స్థానానికి ఉపఎన్నిక జరిగే అవకాశం లేకపోయింది. శాసనమండలి స్థానమూ ఖాళీగా లేదు. దీంతో... చట్టసభల్లో సభ్యుడు కాకున్నా 6 నెలల పాటు మంత్రిగా కొనసాగే అవకాశాన్ని శ్రావణ్‌కి ముఖ్యమంత్రి చంద్రబాటు కల్పించారు. ఈలోగానే ఎలాగూ సాధారణ ఎన్నికలు వస్తాయి కాబట్టి.. అరకు నుంచి శ్రావణ్‌నే పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.