యాప్నగరం

కన్న బిడ్డల్ని చంపిన తండ్రి బతికే ఉన్నాడు!

హైదరాబాద్‌లోని శామీర్‌పేట చెరువులో తన ఇద్దరు పిల్లలతో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనుకున్న అర్జున్‌ బతికే ఉన్నాడు.

TNN 30 Jun 2017, 8:35 am
హైదరాబాద్‌లోని శామీర్‌పేట చెరువులో తన ఇద్దరు పిల్లలతో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనుకున్న అర్జున్‌ బతికే ఉన్నాడు. బేగంపేట సమీపంలోని రసూల్‌పురాకు చెందిన 40 ఏళ్ల అర్జున్ తన ఇద్దరు పిల్లలు ధనుష్ (10), పూజిత (8)లతో కలసి మంగళవారం రాత్రి నగర శివారులోని శామీర్‌పేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో పిల్లలిద్దరూ మరణించినప్పటికీ అర్జున్ మాత్రం బతికాడు. చెరువులో దూకినా ఈత రావడంతో బయటకు వచ్చేశాడు.
Samayam Telugu father attempts suicide after killing children in telangana
కన్న బిడ్డల్ని చంపిన తండ్రి బతికే ఉన్నాడు!


అయితే మరోమారు ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు వివరాల ప్రకారం.. ఈత రావడంతో మునిగే సాహసం చేయలేక బయటికి వచ్చిన అర్జున్ అదే రోజు రాత్రి 2.30 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తరవాత శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యుత్తు స్తంభంపైకి ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసు పెట్రోలింగ్‌ వాహనం అటుగా రావటంతో వారికి కనిపించకూడదనే తొందరలో దిగుతూ కిందపడిపోయాడు. చెట్ల పొదల్లో స్పృహ తప్పి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు అలాగే ఉండిపోయాడు.

తర్వాత లేచి రాజీవ్‌ రహదారిపైకి వచ్చి ఓ లారీలో గజ్వేల్‌ వరకు వెళ్లాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం గౌరారం చేరుకున్నాడు. శామీర్‌పేట చెరువులో అర్జున్‌ శవం లభించకపోవటంతో అతని స్నేహితులు రవి, శ్రీనివాస్‌ బైక్‌పై అతన్ని వెతుకుతూ సిద్దిపేట వైపు వెళ్లారు. గౌరారం వద్ద వీరికి అర్జున్‌ కనిపించాడు. వెంటనే అర్జున్‌ను మాటల్లో పెట్టి అర్జున్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారాన్ని అందించారు. దీంతో వారు గౌరారం చేరుకొని అర్జున్‌ను కలుసుకుని మాట్లాడారు. వారి నుంచి తప్పించుకున్న అర్జున్ దగ్గరలో ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ తీగను పట్టుకున్నాడు. కరెంట్ షాక్ తగిలి అక్కడే పడిపోయాడు.

ఈ ఘటనలో అర్జున్‌ చేయికి తీవ్ర గాయమైంది. అతన్ని బంధువులు వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర వార్డులో చికిత్స చేయిస్తున్నారు. తన ఇద్దరు పిల్లలని చంపి.. తాను పలుమార్లు ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలేంటో తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అర్జున్ కోలుకున్నాక గాని అసలు విషయం తెలీదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.