యాప్నగరం

స్వాతంత్య్ర సమరయోధుడు సీవీ చారి కన్నుమూత

భారత స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, ఆలిండియా హిందీ నాగరిక లిపి అధ్యక్షుడు సీవీ చారి ఆదివారం రాత్రి కన్ను మూశారు.

TNN 19 Sep 2017, 9:16 am
భారత స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, ఆలిండియా హిందీ నాగరిక లిపి అధ్యక్షుడు సీవీ చారి ఆదివారం రాత్రి కన్ను మూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చారి.. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం విజయనగర్ కాలనీలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. చారి అంత్యక్రియలకు పలువురు రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాజికవేత్తలు హాజరై తుది వీడ్కోలు పలికారు.
Samayam Telugu freedom fighter cv chari passes away
స్వాతంత్య్ర సమరయోధుడు సీవీ చారి కన్నుమూత


గాంధేయవాది వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో సీవీ చారి కీలకపాత్ర పోషించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మునుగోడు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో చారి జన్మించారు. 15 ఏళ్ల వయసులో భూదానోద్యమానికి ఆకర్షితులయ్యారు. వినోబా భావేతో కలసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తన భూములను పేదలకు పంచిపెట్టారు. ఆ తరవాత కాలంలో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. తన జీవితమంతా సామాజికసేవకే అంకితం చేశారు. నిరాడంబరమైన జీవితం గడిపిన చారి.. ఎలాంటి ఆర్భాటాలకు తావు ఇవ్వలేదు. రాజకీయ పదవులను ఆశించలేదు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ ట్రస్టుతో ఆయనకు 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం పాటు భూదాన్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు.

కాగా, సీవీ చారికి తుది వీడ్కోలు పలకడానికి ముందు ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నాంపల్లిలోని గాంధీభవన్ ట్రస్టు కార్యాలయంలో ఉంచారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరై సీవీ చారి భౌతికకాయానికి నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ కె.కేశవరావు, గాంధీభవన్ ట్రస్ట్ చైర్మన్ జి.నారాయణరావు తదితరులు హాజరై అంజలి ఘటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.