యాప్నగరం

మెట్రోతో ఆరోగ్య ప్రయాణం.. పర్యాటక ప్రాంతాలుగా స్టేషన్లు: గవర్నర్

రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ అండ్ టీ అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేశాయి. మెట్రో స్టేషన్లు సుందరంగా ఉన్నాయి.

Samayam Telugu 24 Sep 2018, 4:58 pm
కాలుష్యం తగ్గాలంటే మెట్రో ప్రయాణమే మంచిదని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రజలంతా మెట్రో రైలు సేవలు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మెట్రో స్టేషన్‌లో దశలవారీగా సౌకర్యాలు కల్పిస్తామని, మెట్రో స్టేషన్లలో ఆహార పదార్థాలు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. సోమవారం (సెప్టెంబర్ 24) మధ్యాహ్నం అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మార్గంలో మెట్రో రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్‌... అక్కడి నుంచి మెట్రో రైలులో ఎల్బీనగర్‌ స్టేషన్‌ వరకు ప్రయాణించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
Samayam Telugu narasimhan


ప్రతి ఒక్కరూ మెట్రో రైలు సేవలను వినియోగించుకోవడం ద్వారా నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని, తద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని గవర్నర్ సూచించారు. మెట్రో వల్ల రోడ్లపై రద్దీని కూడా తగ్గించవచ్చని, అంబులెన్స్‌లు తదితర అత్యవసర సేవల ప్రయాణాలకు ఆటంకం లేకుండా చేసిన వారమవుతామని గవర్నర్ చెప్పారు. మెట్రోతో ఆరోగ్య ప్రయాణం సొంతమవుతుందని చెప్పుకొచ్చారు.

మెట్రోను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ అండ్ టీ అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేశాయంటూ అభినందించారు. మెట్రో స్టేషన్లు సుందరంగా ఉన్నాయన్న గవర్నర్.. భవిష్యత్తులో వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. మెట్రో ప్రయాణికులను సాధ్యమైనంత త్వరగా సింగిల్‌ కార్డు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.