యాప్నగరం

భారీగా వరద.. శ్రీశైలం డ్యామ్‌కు జలకళ

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం క్రమంగా నిండుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అలమట్టి, నారాయణ పూర్ డ్యాంల జలమట్టం భారీగా పెరిగింది.

Samayam Telugu 21 Jul 2018, 6:23 pm
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం క్రమంగా నిండుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అలమట్టి, నారాయణ పూర్ డ్యాంల జలమట్టం భారీగా పెరిగింది. ఈ వరద నీటితో జురాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. జురాల నుంచి కిందకి నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.
Samayam Telugu srisailam


శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 816 అడుగుల వద్దకు చేరింది. ప్రస్తుతం లక్షా ఎనభై వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అటు తుంగభద్రలోనూ ఇన్‌ఫ్లో 59 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 43 వేల క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలంకు గత ఏడాది ఆగస్టు 28 వరకు 2000 క్యూసెక్కుల లోపు ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి. ఆగస్టు 30న 14,461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, సెప్టెంబర్ 2న 9,718 క్యూసెక్కులు, 3 నుంచి 20 వేల క్యూసెక్కులకు పైగా వరద మొదలై క్రమంగా పెరిగింది. ఈ సారి నెల ముందుగానే 1.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దీంతో మరికొద్ది రోజుల్లోనే డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు నిండితే శ్రీశైలం డ్యాం గేట్లు తెరిచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.