యాప్నగరం

జీఈఎస్ సదస్సు: రెప్పవాల్చని నిఘా..

గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు), మెట్రో రైల్‌ ప్రారంభం.. ఇవాంక ట్రంప్, నరేంద్ర మోదీ పర్యటనల నేపథ్యంలో పోలీస్‌ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భాగ్యనగరాన్ని జల్లెడ పడుతున్నారు.

TNN 26 Nov 2017, 12:40 pm
గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు), మెట్రో రైల్‌ ప్రారంభం.. ఇవాంక ట్రంప్, నరేంద్ర మోదీ పర్యటనల నేపథ్యంలో పోలీస్‌ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భాగ్యనగరాన్ని జల్లెడ పడుతున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులు, నేర చరిత్ర ఉన్నవారిని ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోటలో గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ దళాలు నిరంతరం కూంబింగ్‌ చేస్తున్నాయి. సదస్సును విజయవంతం చేయడం కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు ప్రతిష్టాత్మకం కావడంతో.. పోలీసులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు.
Samayam Telugu high security in hyderabad ahead of pm modi ivanka trumps visit
జీఈఎస్ సదస్సు: రెప్పవాల్చని నిఘా..


ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో గంటల వ్యవధిలో రెండు సార్లు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలు, మురికివాడల్లో నివస్తున్న వారి వేలిముద్రలు సేకరించారు. ముఖ్యంగా పొదలు, అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్‌ చేపట్టారు. ఒకేసారి పది నుంచి పదిహేను బృందాలు ఆకస్మికంగా చుట్టేస్తున్నాయి. స్టాండ్‌ టూ ఫోర్స్‌ పేరుతో 24 గంటలూ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని నియమించారు. హెచ్‌ఐసీసీ వద్ద 2000 మంది, ఫలక్‌నుమా, గోల్కొండ కోట వద్ద ఒక్కో చోట 1500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

సదస్సు ప్రాంగణంలో 2200 మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తారని చెబుతున్నా.. నగరవ్యాప్తంగా సుమారు 15 వేల మంది పోలీసులు భద్రత పర్యవేక్షిస్తున్నారు. నగరానికి దారితీసే రహదారులన్నింటిలో వాహనదారులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ విచ్చేసే అతిథులంతా తిరిగి వెళ్లిపోయేవరకూ (నవంబర్ 30) పోలీసులంతా రెప్పవాల్చకుండా పనిచేసి, ఎవరి పరిధుల్లో వారు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు.

ప్రధానంగా జీఈఎస్‌ సదస్సుకు వేదికైన హెచ్‌ఐసీసీ, ప్రధాని మోదీ విందు ఇవ్వనున్న ఫలక్‌నుమా ప్యాలెస్‌, గోల్కొండ పోర్టుపై శాటిలైట్ నిఘా పెట్టారు. హెచ్‌ఐసీసీలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా భద్రతను చేపట్టారు. ఇవాంకా ట్రంప్‌ బస చేయనున్న హోటల్‌ భద్రత వ్యవహారాలను డీసీపీ స్థాయి అధికారికి అప్పగించారు. మరో అయిదుగురు మహిళా ఉన్నతాధికారులు ఆమె భద్రతను పర్యవేక్షించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.