యాప్నగరం

ప్రగతి నివేదన: చుక్కలు చూపించిన తిరుగు ప్రయాణం

ప్రగతి నివేదన సభ కోసం ఆడుతూ పాడుతూ వచ్చిన జనం.. తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం ట్రాఫిక్ జామ్ కారణంగా తీవ్ర అవస్థలు పడ్డారు.

Samayam Telugu 3 Sep 2018, 12:15 pm
ప్రగతి నివేదన సభ కోసం జిల్లాల నుంచి భారీ ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు కొంగర కలాన్ తరలి వచ్చారు. ట్రాక్టర్లు, కార్లు ఇతర వాహనాల్లో వేలాది మంది ఉత్సాహంగా ఈ సభకు హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచి సభాస్థలి వద్ద జనం సందడి కనిపించింది. ఈ సభ కోసం 80 వేల వాహనాల్లో జనం తరలివచ్చారని అంచనా. వచ్చేటప్పుడు ఒకేసారి రాకపోవడం, పార్టీ నాయకుల మార్గదర్శకత్వం ఉండటంతో.. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగలేదు.
Samayam Telugu pragathi


సభ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో మాత్రం చుక్కలు కనిపించాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోవడంతో.. తిరిగే వెళ్తున్నప్పుడు జనం తిప్పలుపడ్డారు. సభ ముగిశాక ఒక్కసారిగా వాహనాలన్నీ ఔటర్‌ మీదకు చేరాయి. సర్వీసు రోడ్లు, ఇతర రోడ్ల నుంచి కూడా వాహనాలు భారీగా వచ్చేశాయి. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది.

నగరం చుట్టు పక్కలున్న హైవేలు మొత్తం వాహనాలతో రద్దీగా మారిపోయాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కొంగర కలాన్ నుంచి రింగ్ రోడ్డు మీద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను తిరిగి అదుపులోకి తెచ్చే క్రమంలో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ట్రాఫిక్ తగ్గే సూచనలు కనిపించకపోవడంతో.. కొందరు తమ వాహనాలను రింగ్ రోడ్డు మీది నుంచి దింపేసి నిద్రకు ఉపక్రమించారు.

ట్రాక్టర్లలో సభకు వచ్చిన వారిని వెంటనే వెళ్లనీయలేదు. ట్రాక్టర్లను సోమవారం ఉదయం 8 గంటల తరువాత సభా వేదిక దగ్గర్నుంచి పంపించారు. పోలీసులు తీవ్రంగా శ్రమించినా సోమవారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ పూర్తిగా అదుపులోకి రాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.