యాప్నగరం

ఉప్పల్ నరబలి కేసు: నిందితుడు చెప్పింది కట్టుకథే?

గత జనవరి 31 న చంద్రగ్రహణం సందర్బంగా హైదరాబాద్‌లో ఓ చిన్నారిని బలిచ్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

TNN 24 Feb 2018, 10:24 am
గత జనవరి 31 న చంద్రగ్రహణం సందర్బంగా హైదరాబాద్‌లో ఓ చిన్నారిని బలిచ్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో చోటుచేసుకున్న ఈ కేసులో ప్రధాన నిందితుడు క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ పోలీసులను తప్పుదారి పట్టించినట్టు సమాచారం. విచారణలో అతడు వెల్లడించిన విషయాలన్నీ నిజంకాదని, చిన్నారి అపహరణ నుంచి చెప్పినవన్నీ కట్టుకథలేనని భోగట్టా. నిందితుడు వెల్లడించిన విషయాల్లో ఒకదానికీ పొంతనలేదట. చిలుకానగర్‌లో చంద్రగ్రహణం రోజున రాజశేఖర్ ఇంటిపై మూడు నెలల చిన్నారి తల లభించడం కలకలం సృష్టించింది. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్‌తోపాటు అతడి భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు అనుమతితో వారిని కస్టడీకి తీసుకుని విచారించారు.
Samayam Telugu hyderabad baby chopped case accused reveals false information
ఉప్పల్ నరబలి కేసు: నిందితుడు చెప్పింది కట్టుకథే?


కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం తిరిగి నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు అతడి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారట. బోయిగూడలోని రోడ్డు పక్కన గుడిసెలోని చిన్నారిని అపహరించినట్టు చెప్పిన నిందితుడు, అనంతరం పాప తలను వేరుచేసి మొండాన్ని మేడిపల్లి ప్రతాపసింగారం శివారులోని మూసీ నదిలో పడేసినట్టు తెలిపాడు. అయితే, బోయిగూడలో చిన్నారిని అపహరించినట్టు పోలీసులకు ఆధారాలు లభించలేదు. చిన్నారి కనిపించకుండా పోతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసి ఉంటారు. కానీ అయితే ఇప్పటిదాకా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో అతడు చెప్పినవన్నీ కల్లబొల్లి మాటలేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారిని వేరే ప్రాంతంలో అపహరించాడా లేదా ఏదైనా తండాలో కొనుగోలు చేశాడా అనే వాదన వినిపిస్తోంది.

రాజశేఖర్ ఇంట్లో లభ్యమైన రక్తపు మరకలు, చిన్నారి తలకు ఉన్న మరకలు ఒకరివేనని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యింది. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారినా, చిన్నారిని ఎక్కడి నుంచి అపహరించారు? మొండెం ఏమైంది? అనేవి మిస్టరీగానే మిగిలిపోయాయి. వీటికి సమాధానాలు లభిస్తే కానీ చిక్కుముడి వీడేలాలేదు. రాజశేఖర్ చెబుతున్నట్టు మూసిలో చిన్నారి మొండాన్ని విసిరి ఉంటే దాని ఆచూకి లభించడం అసాధ్యం. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ లభిస్తేనే ఈ కేసు ముందుకు సాగి, స్పష్టత వస్తుందని పోలీసులే అంటున్నారు. దీంతో మిగతా సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.