యాప్నగరం

నటించి, నమ్మించి కత్తితో వేటు.. ఎర్రగడ్డ దాడి వీడియో

ప్రేమ వివాహానికి అంగీకరించినట్లు నమ్మించి మోసం చేశాడు. పక్కా ప్రణాళికతో ఇంటికి పిలిచి దాడి చేశాడు. ఎర్రగడ్డ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు.

Samayam Telugu 19 Sep 2018, 8:45 pm
ప్రేమ జంటలపై పరువు కత్తిగట్టింది. మిర్యాలగూడ ఘటన మరవక ముందే హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డలో మరో దారుణం వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటపై అమ్మాయి తండ్రే అత్యంత కిరాతకంగా దాడి చేశాడు. కొబ్బరిబొండాలు నరికే కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu erragadda


ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌ (24), బోరబండ వినాయక్‌రావు నగర్‌కు చెందిన మాధవి (22) పదో తరగతి నుంచే ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. ఐదేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం ఇటీవలే పెద్దలకు తెలిసింది. దీంతో మాధవి తండ్రి మనోహరాచారి ఆమెను మందలించాడు. సందీప్ ఎస్సీ వర్గానికి చెందిన యువకుడు కావడంతో పెళ్లికి నిరాకరించాడు.

కులాలు వేరుకావడంతో పెళ్లికి నిరాకరించిన మాధవి తల్లిదండ్రులు ఆమెకు మేనబావతో పెళ్లి నిశ్చియించారు. దీంతో ఆమె కొద్ది రోజుల కిందట కన్నవాళ్లకు చెప్పాపెట్టకుండా సందీప్‌ ఇంటికి వచ్చేసింది. 10 రోజుల కిందట అల్వాల్‌లోని ఓ ఆలయంలో వీరు పెళ్లి చేసుకున్నారు..

మిర్యాలగూడ ఘటనతో మరింత కసి
పెళ్లి విషయం తెలిసిన నాటి నుంచి మనోహరాచారి తన పరువు పోయిందని పగతో రగిలిపోయాడు. అదను చూసి దాడి చేయాలని భావించాడు. మిర్యాలగూడ ఘటన అతడిలో మరింత కసి రేపింది. ఈ క్రమంలో పెళ్లికి అంగీకరించినట్లు నటించి మాధవితో మాట కలిపాడు. తరచూ సందీప్ ఇంటికి వెళుతూ తన కూతుర్ని మంచిగా చూసుకోవాలని చెప్పాడు.
కూతురును చూడాలని ఉందని, దుస్తులు పెడతానని నవ దంపతులను మనోహరచారి రెండు రోజుల కిందట ఆహ్వానించాడు. కొత్త బట్టలు ఇప్పిస్తానని ఎర్రగడ్డలోని హోండా షోరూం వద్దకు రమ్మన్నాడు. ఆ నెపంతో కడతేర్చడానికి పథకం పన్నాడు. చారి పిలుపు మేరకు సందీప్, మాధవి ఎర్రగడ్డకు చేరుకున్నారు. ఆ వెంటనే వచ్చిన మనోహరచారి అకస్మాత్తుగా వారిపై దాడి చేశాడు.

బ్యాగులో కొబ్బరిబొండాలు నరికే కత్తి పెట్టుకొని వచ్చిన నరసింహాచారి ఒక్కసారిగా సందీప్‌పై దాడికి దిగాడు. మాధవి అడ్డుకోవడంతో అతడు ఓ మోస్తరు గాయాలతో బయటపడి దూరంగా పారిపోయాడు. దీంతో రెచ్చిపోయిన చారి తన కూతురు మాధవిపై కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా నరకడంతో ఆమె చెవి, మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. చేయి తెగి పడిపోయింది.

ప్రేమ జంటపై దాడి చేస్తుండగా కొంత మంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, మనోహరచారి కత్తితో వారిని బెదిరిస్తూ తన పని కానిచ్చాడు. దాడి అనంతరం అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. దాడి తర్వాత అక్కడి నుంచి పరారైన మనోహరాచారి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.