యాప్నగరం

మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి మేనల్లుడు మృతి.. శవాన్ని పీక్కుతిన్న పెంపుడు కుక్క

మేనమామ ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేస్తే, తండ్రి మాజీ ఐపీఎస్ అధికారి, సోదరుడు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఎవరూ లేని అనాధగా కుటుంబానికి దూరమై ఒంటరిగా ఉంటున్నాడు.

Samayam Telugu 22 Nov 2018, 1:00 pm
మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి మేనల్లుడు హరిహరరెడ్డి అత్యంత దారుణ స్థితిలో మరణించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గత కొంతకాలంగా ఒంటరిగా నివాసం ఉంటోన్న హరిహరరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఎప్పుడు మరణించారో స్పష్టంగా తెలియదు కానీ, ఆయన మృతదేహం మాత్రం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఆయన గదిలోనే ఉన్న పెంపుడు కుక్క హరిహరరెడ్డిని పీక్కు తినడం హృదయాన్ని కలచివేస్తోంది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu Harihara_Reddy


హరిహరరెడ్డి బంజారా హిల్స్ రోడ్ నెంబరు 5లో భార్యపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆమె ఏడాది కిందటే పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఎంఎల్ఎన్ రెడ్డి కుమారుడైన హరిహరరెడ్డి తండ్రికి చెందిన భవనంలో ఉంటూ సోదరుడు నెల నెలా పంపుతోన్న డబ్బులతో కాలం వెళ్లదీసేవారు. అయితే, ఒంటరిగా ఉన్న ఆయన మరణించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

ఎప్పుడు మృతిచెందారో ఎవరికీ తెలియకపోయినా, ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తన సోదరుడు, ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డికి సమాచారం అందజేశారు. ఆయన వచ్చి తలుపులు తెరవగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న హరిహర రెడ్డి శవం కనిపించింది. అంతేకాదు, అక్కడే ఉన్న వారి పెంపుడు కుక్క ఆకలికి తట్టుకోలేక ఆయన ఎడమ భుజం, చేతివేళ్లను పీక్కుతిన్నట్టు గుర్తించారు. దీన్ని అనుమానాస్పద కేసుగా నమోదుచేసిన పోలీసులు ఆ ఇంటి పరిసరాల్లో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు.

హరిహరరెడ్డి ఆరు రోజుల కిందటే మరణించి ఉంటాడని భావిస్తున్నారు. హరిహరరెడ్డి భార్య పుట్టింటివారిది నెల్లూరు కావడంతో ఏడాది నుంచి ఆమె అక్కడే ఉంటున్నారు. మేనమామ ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేస్తే, తండ్రి మాజీ ఐపీఎస్ అధికారి, సోదరుడు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఎవరూ లేని అనాధగా హరిహరరెడ్డి కుటుంబానికి దూరమయ్యారు. మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారా? అనారోగ్యంతో మృతిచెందారా? అనేది పోస్ట్‌మార్టం అనంతరమే నిర్ధారణ అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.