యాప్నగరం

భాగ్యనగరంలో 21 నుంచి ‘ఫొటోగ్రఫీ పండగ’

హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 8 వరకు ‘ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ (ఐపీఎఫ్ 2017)’ జరగనుంది. ఫొటోగ్రఫీ లవర్స్, యువ ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఇదొక చక్కని వేదికగా ఉపయోగపడనుంది..

TNN 14 Sep 2017, 5:22 pm
ఒక మంచి ఫొటో.. మాటల్లో వ్యక్తం చేయలేని వేల భావాలను తెలుపుతుంది. అందుకే ఫొటోగ్రఫీ రంగానికి నానాటికీ ఆదరణ పెరుగుతోంది. ఆధునిక సాంకేతికత సహకారంతో ఫొటోగ్రఫీ మరిన్ని సొబగులను అద్దుకుంటోంది. అలాంటి కిటుకులన్నీ ఒకే చోట చేరితే.. ఆ వృత్తిని ప్రేమించే వారందరికీ పండగే కదా మరి. అలాంటి ప్రతిష్టాత్మక ‘ఫొటోగ్రఫీ పండగ’కు భాగ్యనగరం ముస్తాబవుతోంది. హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 8 వరకు ‘ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ (ఐపీఎఫ్ 2017)’ జరగనుంది. ఫొటోగ్రఫీ లవర్స్, యువ ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఇదొక చక్కని వేదికగా ఉపయోగపడనుంది.
Samayam Telugu indias largest photography festival from september 21 in hyderabad
భాగ్యనగరంలో 21 నుంచి ‘ఫొటోగ్రఫీ పండగ’


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వరసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న ఈ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌లో.. భిన్న అభిరుచులకు చెందిన ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్, చర్చా వేదిక, వర్క్‌షాప్‌లు, రివ్యూలు ఉంటాయి. పొటో జర్నలిస్టు, నేషనల్ జియోగ్రాఫికల్ ఫొటోగ్రాఫర్ రేజా దెఘాటి, అంతర్జాతీయ ఫొటోగ్రఫీ సంస్థ ‘మాగ్నమ్ ఫొటోస్‌’లో కీలక ఫొటోగ్రాఫర్ స్టువర్ట్ ఫ్రాంక్లిన్, ప్రసిద్ధ వార్ డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ బ్రూస్‌తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పలువురు ఫొటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో సుమారుగా 40 దేశాల నుంచి 525 మంది ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటారని తెలంగాణ టూరిజం శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. కిందటేడాది 30 దేశాల నుంచి 300 మంది పాల్గొనగా.. ఈసారి ఆ సంఖ్య మరింతగా పెరిగినట్లు ఆయన తెలిపారు.

‘ప్రపంచంలో ఫొటోగ్రఫీకి ఓ ప్రత్యేక ఆదరణ ఉంది. అలాంటి అంశానికి హైదరాబాద్ వరసగా మూడోసారి వేదిక అవుతుండటం ఆనందకరమైన విషయం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఫొటోగ్రాఫర్లు ఇక్కడికి విచ్చేస్తుండటం భాగ్యనగరానికి ప్రత్యేక గౌరవం’ అని వెంకటేశం పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.