యాప్నగరం

మనీల్యాండరింగ్ జాబితా టాప్-10లో జగన్

పెద్ద ఎత్తున విదేశాలకు తరలించిన వ్యక్తుల సమాచారాన్ని గతేడాది పనామా పేపర్లు, ఈ ఏడాది ప్యారడైజ్ పేపర్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే.

TNN 24 Nov 2017, 11:11 am
పెద్ద ఎత్తున విదేశాలకు తరలించిన వ్యక్తుల సమాచారాన్ని గతేడాది పనామా పేపర్లు, ఈ ఏడాది ప్యారడైజ్ పేపర్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల బయటకు వచ్చిన ప్యారడైజ్ పేపర్లలో భారత్‌కు చెందిన 714 మంది పేర్లు కూడా ఉన్నాయి. అందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. తాజాగా లెక్కల్లో చూపని సంపాదనను అక్రమ మార్గాల ద్వారా చలామణిలోకి తీసుకొస్తూ, షెల్ కంపెనీలను నడుపుతోన్న వారి జాబితాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూపొందించింది. హవాలా ద్వారా విదేశాలకు పెద్ద మొత్తంలో తరలించి తిరిగి పెట్టుబడుల రూపంలో వాటిని తెచ్చుకుంటున్న తొలి 12 సంస్థల జాబితాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా ఉన్నారని ఈడీ తెలిపింది. డొల్ల కంపెనీలు పెట్టి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు తరలించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ చేపట్టిన ఈడీ రూ.200 కోట్లకుపైగా మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన వారి జాబితా రూపొందించింది.
Samayam Telugu jagan mohan reddy chhagan bhujbal figure in ed list of top launderers
మనీల్యాండరింగ్ జాబితా టాప్-10లో జగన్


ఈడీ రూపొందించిన ఈ జాబితాలో జగన్ పదో స్థానంలో ఉండగా, మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత చగన్ భుజ్‌బల్‌ 12వ స్థానంలో నిలిచారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు 31 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రూ.368 కోట్ల, ఎన్సీపీ నేత చగన్ భుజ్‌బల్ 81 డొల్ల కంపెనీల ద్వారా రూ.200 కోట్ల హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే చత్తీస్‌గఢ్ మాజీ సీఎం బాబూలాల్ అగర్వాల్ కూడా 13 కంపెనీల ఏర్పాటుచేసి రూ.60 కోట్లు కొల్లగొట్టినట్లు ఈడీ పేర్కొంది.

హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, జలంధర్, రాయ్‌పూర్, చెన్నై, పనాజీలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతున్నట్టు ఈడీ గుర్తించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నట్టు ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్‌కు పాల్పడుతోన్న మొత్తం వెయ్యికిపైగా షెల్ కంపెనీలను ఈడీ గుర్తించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.