యాప్నగరం

జగన్‌ను ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపిన పోలీసులు!

విశాఖపట్నంలో చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిర్‌పోర్టు నుంచే పోలీసులు వెనక్కి పంపారు.

TNN 26 Jan 2017, 9:24 pm
విశాఖపట్నంలో చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిర్‌పోర్టు నుంచే పోలీసులు వెనక్కి పంపారు. ఈరోజు సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ బృందాన్ని రన్‌వేపైనే పోలీసులు అడ్డుకున్నారు. ఆగమన ద్వారం మూసేసిన పోలీసులు జగన్‌ను ముందు కదలనివ్వలేదు. దీంతో జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
Samayam Telugu jagan mohan reddy detained at vizag airport police sent him back
జగన్‌ను ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపిన పోలీసులు!


ఒకానొక దశలో సహనం కోల్పోయిన జగన్ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎలా ప్రవర్తించాలో తెలియనివారు కూడా పోలీసులయ్యారని జగన్ మండిపడ్డారు. అప్పటికి పోలీసులు బయటికి పంపడానికి నిరాకరించడంతో జగన్ అక్కడే బైఠాయించారు. జగన్‌తో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు ఉన్నారు. మొత్తానికి రాత్రి 6.30 ప్రాంతంలో పోలీసులు జగన్‌ను బలవంతంగా ఎయిర్ ఇండియా విమానం ఎక్కించి హైదరాబాద్‌కు పంపేశారు. జగన్‌తో పాటు వైకాపాకు చెందిన ఆరుగురు నేతలను విమానంలో వెనక్కు పంపారు.

ఏదేమైతేనేం ఆంధ్రా పోలీసులు తమ సత్తా చాటారు. ‘జల్లికట్టు’ను ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం మౌన పోరాటం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో ఆంధ్రా పోలీసులు విజయం సాధించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు ఆందోళనకారులు ఎవరూ చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఉద్యమానికి సంఘీభావం చెప్పడానికి వెళ్లిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబును కూడా వైజాగ్ పోలీసులు అరెస్టు చేసారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.