యాప్నగరం

ప్రజలను మోసం చేయబట్టే అవిశ్వాసం పెట్టాం - జగన్

ఏపీ అసెంబ్లీ లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత జనగ్ ప్రసంగించారు.

TNN 14 Mar 2016, 5:24 pm
హైదరాబాద్: రైతుల నుంచి అన్యాయంగా భూములు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాటితో ప్రభుత్వ పెద్దలు భూదందా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమంటే రాజధాని ప్రతిష్టదెబ్బతింటుందనే సాకు చూపించి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
Samayam Telugu jagan speech in assembly
ప్రజలను మోసం చేయబట్టే అవిశ్వాసం పెట్టాం - జగన్


కాపు-బీసీల మధ్య గొడవపెడుతున్నారు..

ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.. తీరా దాని గురించి అడిగితే కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని.. ఇది చాలదన్నట్లు కాపులు-బీసీల మధ్య గొడవను సృష్టించారని జగన్ మండిపడ్డారు. మరోవైపు బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాట తప్పారని విమర్శించారు. అలాగే ఎస్సీ -ఎస్టీల మధ్య చిచ్చు పెట్టి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

బాబు వచ్చినా జాబు రాలేదు...

బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారంతో ఉదరగొట్టారు. తీరా అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న జాబులను పీకే పరిస్థితులు సృష్టించారని జగన్ విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల క్షణ క్షణం ఆందోళనతో గడుపుతున్నారన్నారు. డీఎస్సీ రాసిన అభ్యర్ధులు ఉద్యోగాల భర్తీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు... నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని .. వారి ఏ ఒక్క అవసరాన్ని ప్రభుత్వం తీర్చలేక పోయిందని విమర్శించారు.మరోవైపు జీతాల కోసం రోడ్డెక్కిన అంగన్ వాడీలకు పోలీసుల చేతకొట్టించారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు, డ్వాక్రా మహిళలకు మోసం చేశారు...

రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి వారిని నిలువునా మోసం చేశారని జగన్ విమర్శించారు.వరి, పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని మాట తప్పారని ఆరోపించారు. విభజనతో రాజధాని సహా సర్వం కోల్పోయిన ఏపీ ప్రజలకు ఊరట కల్గించే ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. రాజధాని నిర్మాణం దగ్గర నుంచి విభజన హామీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని.. దీంతో ఈ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు. ప్రజల అభిప్రాయలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు జగన్ వివరణ ఇచ్చారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.