యాప్నగరం

వేల కోట్లున్న ప్రతి ఒక్కరూ సీఎం కాలేరు: పవన్ కళ్యాణ్

ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం పోలవరం నిర్వాసితులను పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న గ్రామాల్లో పర్యటించారు.

Samayam Telugu 9 Oct 2018, 5:08 pm
రాబోయే తరానికి అండగా ఉండటానికి, ఈ తరంతో కలిసి దుష్ట రాజకీయ నాయకులతో పోరాడటానికి జనసేన పార్టీని పెట్టానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాన్ని వేల కోట్ల రూపాయలతో నిండిపోయిన వ్యాపారం చేశారని విమర్శించారు. తన దగ్గర వేలకోట్లు లేవని, ప్రజల గుండెల్లో ఉన్న స్థానమే తనకు ఆస్తి అని అన్నారు. ప్రజలే తన శక్తి అని ఉద్ఘాటించారు. వేల కోట్ల రూపాయలు ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కాలేరని, లక్షల కోట్ల రూపాయలు ఉన్న ప్రతి నాయకుడు ప్రధాన మంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. ప్రస్తుత వ్యవస్థ అవినీతితో నిండిపోయిందన్నారు.
Samayam Telugu Pawan_Kalyan


ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం పోలవరం నిర్వాసితులను పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న గ్రామాల్లో పర్యటించారు. అనంతరం పోలవరం గ్రామంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించినప్పుడు వాళ్లను తాను ఓట్లు అడగలేదని, వాళ్ల తరఫున పోరడటానికి జనసేన అనే పార్టీ ఒకటి వచ్చిందని చెప్పానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

‘భారతదేశానికే గొప్ప పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్ పోలవరం. ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీరు అందుతుంది. అయితే ఈ ప్రాజెక్టు కారణంగా కొన్ని వందల గ్రామాల ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. వారికి అందాల్సిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడంలేదు. అధికార పక్షం, ప్రతిపక్షానికి చెందిన నాయకులు ప్రజలను త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండమని చెబుతూ ఉంటారు. కానీ వాళ్ల జీవితాలను మాత్రం త్యాగం చేయరు. ఈ ప్రాజెక్టుకు ఎవరూ వ్యతిరేకం కాదు. నిర్వాసితులు కోరుతున్నదే ఒక్కటే పరిహారం’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

పోలవరం నిర్వాసితుల ఆవేదనను తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్‌లో రోడ్ల వెడల్పు చేపట్టారని, అప్పుడు ఎంపీగా ఉన్న మైసూరారెడ్డి ఇంటిని కొంత మేర కొట్టేశారని పవన్ చెప్పారు. దీంతో మైసూరారెడ్డికి కోపం వచ్చి తువాలు కట్టుకుని రోడ్డుపై స్నానం చేశారని పవన్ గుర్తు చేశారు. అంత అధికారం, అన్ని వందల కోట్ల ఆస్తి ఉన్న ఎంపీకే ఆవేదన కలిగిన రోడ్లపైకి వచ్చినప్పుడు తరతరాలుగా ఇక్కడే ఉంటున్న ఈ ప్రజలకు ఆవేదన కలగదా అని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.