యాప్నగరం

అనుమానంతో హత్యలు: భార్య సహా ముగ్గురిని చంపిన ఖమ్మం జవాన్

అనుమానం ఎంతటి అఘాయిత్యానికి దారితీస్తుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది.

TNN 1 Dec 2017, 9:30 am
అనుమానం ఎంతటి అఘాయిత్యానికి దారితీస్తుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో ఉద్యోగం నిమిత్తం ఖమ్మం జిల్లా నుంచి జమ్మూకశ్మీర్‌కు వెళ్లాడు. 2014 నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ సేవలో నిమగ్నమయ్యాడు. పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు. కానీ భార్యపై అనుమానంతో క్రూరంగా మారిపోయాడు. భార్యతో పాటు పక్కింటిలో ఉంటున్న తన సహోద్యోగి, అతని భార్యను కాల్చి చంపేశాడు. క్షణికావేశంలో అతను చేసిన తప్పిదంతో జీవితం తలకిందులైపోయింది. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలను అనాథలను చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu jawan kills wife colleague in jammu allegedly over affair
అనుమానంతో హత్యలు: భార్య సహా ముగ్గురిని చంపిన ఖమ్మం జవాన్


భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన ఇంగలపు సురేంద్ర(32) 2014లో సీఐఎస్ఎఫ్‌లో చేరాడు. అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని దులాస్టిలోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్పీసీ) యూనిట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సురేందర్‌కు కృష్టా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరుకు చెందిన లావణ్య(30)తో వివాహం జరిగింది. వీరికి చంద్రశేఖర్(7), చింటు(6) పిల్లలు. కొంతకాలంగా ఈ కుటుంబంతో సురేంద్ర దులాస్టిలోనే నివాసం ఉంటున్నాడు. వీరు ఉంటున్న పక్కింటిలోనే సురేంద్ర సహోద్యోగి రాజేష్ తన కుటుంబంతో జీవిస్తున్నాడు. వీరికీ ఇద్దరు పిల్లలున్నారు. అయితే సురేంద్ర తన భార్య లావణ్య, సహోద్యోగి రాజేష్‌పై అనుమానం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి విధులకు వెళ్లిన సురేంద్ర గురువారం తెల్లవారుజాము రెండు గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రాజేష్ ఇంటి బయట ఉండటంతో సురేంద్ర ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇంట్లోకి వెళ్లి భార్య లావణ్యను ముందు కాల్చి చంపాడు. ఆ తరవాత బయటకు వచ్చి రాజేష్‌పై కాల్పులు జరిపాడు. శబ్దాలకు బయటికి వచ్చిన రాజేష్ భార్య శోభను కాల్చి చంపేశాడు. కేవలం కొన్ని సెకెన్ల సమయంలో సరేందర్ మూడు హత్యలు చేసేశాడు. రాజేష్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం సురేంద్ర పోలీసుల అదుపులో ఉన్నాడు. అతన్ని సస్పెండ్ చేసినట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రకటించారు. లావణ్య మృతదేహాన్ని శుక్రవారం స్వస్థలానికి తీసుకురానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.