యాప్నగరం

చింతమనేనిని అరెస్ట్ చేయాలి.. జర్నలిస్టుల ఫిర్యాదు

అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే తమను దూషించడంతో పాటు దౌర్జన్యానికి పాల్పడ్డారని జర్నలిస్టులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Samayam Telugu 1 Nov 2018, 4:32 pm
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు విజిలెన్స్‌ కార్యాలయం వద్ద వీడియో జర్నలిస్టులను దూషించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని త్రిటౌన్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో ఎమ్మెల్యే తమను దూషించడంతో పాటు దౌర్జన్యానికి పాల్పడ్డారని జర్నలిస్టులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Samayam Telugu Chintamaneni Prabhakar


ఫిర్యాదు చేసిన అనంతరం అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావుని కలిసిన జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. అక్రమంగా ఇసుక తవ్వుతున్నారన్న కారణంగా రెండు రోజుల కిందట చింతమనేని అనుచరుల వాహనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న చింతమనేని, ఆయన అనుచరులు దాదాపు 100 మంది ఘటనాస్థలానికి చేరుకుని సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లారు. దీనిపై విజిలెన్స్ అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

గతంలోనూ పలు సందర్భాలలో ప్రభుత్వ అధికారులు, మహిళలపై చింతమనేని దాడులు చేయడం వివాదాస్పదమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో చింతమనేని యధేచ్చగా అసభ్య పదజాలం వాడుతూ మహిళలతో పాటు జర్నలిస్టులపై కూడా దాడులకు వెనుకాడటం లేదని జర్నలిస్టులు పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.