యాప్నగరం

కొడంగల్ పోరు: రేవంత్ రెడ్డి x హరీష్ రావు

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అంతకు ముందే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో కొడంగల్‌లో ఉపఎన్నిక జరిగే అవకాశం ఉంది.

TNN 1 Nov 2017, 4:00 pm
ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో తెలంగాణలో ఉపఎన్నిక దాదాపు ఖాయమైనట్లే. కొడంగల్‌ నియోజకవర్గంపై గట్టి పట్టున్న రేవంత్ రెడ్డి.. ఈ ఉప ఎన్నికలో గెలిస్తేనే కేసీఆర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఇక్కడ గెలిచిన పార్టీనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే మాట ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఉపఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి చనిపోతేనే.. కేసీఆర్ ఆ స్థానంలో తుమ్మలను నిలబెట్టి గెలిపించారు. ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్పుకున్నారు. ఇప్పుడు తనకు సవాల్ విసురుతున్న రేవంత్‌కు ఆదిలోనే షాకిచ్చేందుకు గులాబీ బాస్ వ్యూహాలు రూపొందిస్తున్నారు.
Samayam Telugu kcr delegates kodangal bypoll responsibility to harish rao
కొడంగల్ పోరు: రేవంత్ రెడ్డి x హరీష్ రావు


రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కొడంగల్‌లో గులాబీ జెండాను ఎగరేసి తీరాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. కాకపోతే కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డికి కంచుకోట. అక్కడి నుంచే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో చేరి ఉత్సాహం మీదున్న రేవంత్‌ను సొంత గడ్డ మీద దెబ్బ తీసి సత్తా చాటాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే కొడంగల్‌లో కింది స్థాయి టీడీపీ కేడర్‌ను గులాబీ పార్టీ తన వైపు తిప్పుకుంది. కేసీఆరే లక్ష్యంగా దూసుకొస్తున్న రేవంత్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఇదొక్కటే సరిపోదని టీఆర్ఎస్ భావిస్తోంది.


ఉప ఎన్నికలు జరిగితే కొడంగల్‌లో గులాబీ జెండా ఎగరేయడం కోసం కేసీఆర్ మంత్రి హరీష్ రావును రంగంలోకి దించారు. వరంగంల్ ఎంపీ స్థానం సహా పలు ఉపఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. కొడంగల్ బాధ్యతల్ని కూడా గులాబీ చీఫ్ ఆయనకే అప్పగించారు. మేనల్లుణ్ని ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. పార్టీ అధినేత ఆదేశాలతో హరీష్ ఇప్పటికే రంగంలోకి దిగారు. రేవంత్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించారు. రేవంత్ అనుచరుల్ని తమ వైపు లాక్కోవడంతోపాటు, నంద్యాల తరహాలో నియోజకవర్గం అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేయడం లాంటి వ్యూహాలను టీఆర్ఎస్ అనుసరించే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేసినా.. పోరు మాత్రం రేవంత్ వర్సెస్ హరీష్‌గా సాగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.