యాప్నగరం

కేరళకు చేయూత: ఏపీఎస్ఆర్టీసీ 3 కోట్లు, స్టీల్ ప్లాంట్ సిబ్బంది 2 కోట్లు

వరదలతో కకావికలమైన కేరళను ఆదుకోడానికి దేశవ్యాప్తంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఓవైపు వివిధ రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయం చేసి చేయూతనందిస్తున్నాయి.

Samayam Telugu 22 Aug 2018, 8:34 am
వరదలతో కకావికలమైన కేరళను ఆదుకోడానికి దేశవ్యాప్తంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఓవైపు వివిధ రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయం చేసి చేయూతనందిస్తున్నాయి. ఇక వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలివిడతగా రూ.6 కోట్ల విలువైన 255 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 11 లారీల్లో మంగళవారం పంపింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి వాహనాలకు జెండా ఊపి పంపించారు. మొత్తం 2000 టన్నుల బియ్యాన్ని పంపించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు సైతం తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తాము ప్రకటించిన ఒకరోజు వేతనం రూ.3 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య, సంస్థ ఎండీ సురేంద్రబాబులు ముఖ్యమంత్రికి అందజేశారు.
Samayam Telugu కేరళకు ఏపీ ప్రభుత్వం బియ్యం


అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, అధికారుల సంఘ నాయకులు రూ.2 కోట్లు విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ మొత్తాన్ని ఆగస్టు నెల జీతాల నుంచి సేకరించి కేరళ ప్రభుత్వ ఖాతాకు పంపాలని నిర్ణయించారు. ఇక విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఉద్యోగులు కూడా ఒకరోజు వేతనాన్ని కేరళ బాధితుల సహాయార్థం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏపీ వైద్య విధాన పరిషత్ రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల వేతనం, శాసనసభ సిబ్బంది ఒక రోజు జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఏపీఐఐసీ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.10 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.