యాప్నగరం

YS Jagan Attack Case: కోడి కత్తి దాడి కేసు.. కోర్టుకు చేరిన జగన్ చొక్కా

కోర్టుకు చేరిన వైఎస్ జగన్ చొక్కా.. విశాఖ కోర్టులో సమర్పించిన జగన్ తరఫు లాయర్.. దాడి కేసుకు సంబంధించి హైకోర్టులో మరో రెండు పిటిషన్లు..

Samayam Telugu 24 Nov 2018, 9:17 am
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో కీలకమైన చొక్కా కోర్టుకు చేరింది. రక్తపు మరకలతో ఉన్న ఆ చొక్కాను.. హైదరాబాద్ నుంచి వచ్చిన జగన్ తరఫు లాయర్ విశాఖలోని కోర్టుకు అందజేశారు. అలాగే ఈ షర్ట్‌ను కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు ఇవ్వొద్దని కోరారు. హైకోర్టులో వైఎస్ జగన్ వేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకూ సీల్డ్‌ కవరులోనే ఉంచాలని మెమో ఫైల్ చేయగా.. పరిశీలిస్తామని జడ్జి తెలియజేశారు.
Samayam Telugu Jagan


మరోవైపు దాడి ఘటనలో.. జగన్ హైకోర్టులో మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. 1982 సేఫ్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ చట్టం ప్రకారం ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ, కంచరపాలెం ఎస్‌హెచ్‌వోలు వ్యవహరించలేదని ఆరోపించారు. 1982 చట్టంతోపాటు 1934 ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం ప్రకారం నేర సమాచారం అందిన తర్వాత.. సీఆర్పీసీ సెక్షన్‌ 154 కింద ఎస్‌హెచ్‌వో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలని గుర్తు చేశారు. రాష్ట్ర సర్కారు సాధ్యమైనంత వేగంగా కేంద్రానికి నివేదించాలని పేర్కొన్నారు. ఈ దాడిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఇప్పటికే ఆయన ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. దానికి అనుబంధంగా తాజా వ్యాజ్యం వేశారు.

ఇటు జగన్‌పై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో మరో పిల్ వేశారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని, నివేదికను కేంద్రానికి పంపించేలా రాష్ట్ర సర్కారును ఆదేశించాలని కోరారు. హత్యాయత్నంపై దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విన్నవించారు. డీజీపీ, సిట్‌ ఇన్‌చార్జి, విశాఖ పోలీస్‌ కమిషనర్, ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓలను ప్రాసిక్యూట్‌ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలన్నారు. రాష్ట్ర పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఈ కేసులో నిందితుడు జె.శ్రీనివాసరావుకు న్యాయస్థానం డిసెంబరు 7వ తేదీ వరకూ రిమాండ్‌ పొడిగించింది. శుక్రవారం అతడిని పోలీస్‌ బందోబస్తు మధ్య ఏడో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.