యాప్నగరం

అసెంబ్లీకి పెళ్లి సెలవులు, టీడీపీ నేత ఫైర్!

పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేడు, రేపు, ఎల్లుండి.. మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ, ఏపీ శాసనమండలికి వరస సెలవులు ఇచ్చారు.

TNN 23 Nov 2017, 2:39 pm
పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేడు, రేపు, ఎల్లుండి.. మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ, ఏపీ శాసనమండలికి వరస సెలవులు ఇచ్చారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయని, హాజరు కావాల్సి వస్తోందని.. కాబట్టి సభకు, మండలికి సెలవులు ప్రకటిస్తే మేలని సభ్యులు ప్రతిపాదించారు. అటు బీజేపీ నేతలు, ఇటు తెలుగుదేశం నేతలు... సెలవులు కోరుకోవడంతో మూడు రోజుల పాటు సమావేశాలకు విరామం ఇచ్చారు. ముందస్తుగా శాసనసభ, శాసనమండలి షెడ్యూల్ ప్రకారం ఈ సెలవులు ఏమీ లేవు. అనుకోకుండా సభలో, మండలిలో ఈ ప్రతిపాదన చేసి.. సెలవులు తీసుకున్నారు సభ్యులు. ఎలాగూ శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్ష పార్టీ కూడా లేకపోవడంలో.. దీనిపై మరో వాదన ఏమీ లేకుండా మూడు రోజుల పాటు విరామం ఇచ్చేశారు.
Samayam Telugu marriage leaves for ap aseembly
అసెంబ్లీకి పెళ్లి సెలవులు, టీడీపీ నేత ఫైర్!


మరి ఈ అంశమై తెలుగుదేశం నేతల మధ్యనే వాదోపవాదాలు జరగడం గమనార్హం. మూడు రోజుల పాటు ఇలా పెళ్లిళ్లకు అని సెలవులు ప్రకటించడం పట్ల ఎమ్మెల్సీ శమంతకమణి అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై ఆమె శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమలను నిలదీశారు కూడా. ‘మీ ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగితే ఇలా సెలవులు ఇచ్చుకుంటారా?’ అని ఆమె యనమలతో వ్యాఖ్యానించారు. బుధవారం మండలి లాబీలో యనమల ఎదురుపడినప్పుడు ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

శమంతకమణి ఈ విధంగా ప్రశ్నించడం వెనుక అసలు కథ వేరే ఉంది. నవంబర్ పదహారో తేదీన శమంతకమణి మనవరాలి పెళ్లి జరిగింది. సొంత జిల్లా కేంద్రం అనంతపురం వేదికగా జరిగిన ఈ పెళ్లికి టీడీపీ నేతలు హాజరు కాలేకపోయారు. ఆ రోజున వాళ్లంతా పోలవరం పర్యటనకు వెళ్లారు. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్లే షెడ్యూల్ చేశారు. తన మనవరాలి పెళ్లి రోజున అలా అందరినీ పోలవరం తీసుకెళ్లారు అని, ఎవరినీ పెళ్లికి రాకుండా చేశారనేది శమంతకమణి ఫిర్యాదు.

‘దళితులకు పదవులు ఇవ్వరు. దళితుల ఇళ్ల పెళ్లిళ్లకు ఎవరినీ రానివ్వరు.. అదే మీ ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగితే మాత్రం సభకు, మండలికి సెలవులు ఇచ్చేస్తారు..’ అని శమంతకమణి అన్నారు. నేడు, రేపు, ఎల్లుండి పలువురు టీడీపీ నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లున్నాయి. ఈ నేపథ్యంలో సభకు, మండలికి సెలవులు ప్రకటించారు. శమంతకమణి నిలదీతకు యనమల సమాధానం ఏమీ ఇవ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.