యాప్నగరం

ప్రియురాలు దాడి చేయించిందని వివాహితుడి ఆత్మహత్య

ఆ యువకుడికి పెళ్లైంది. నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఇంకో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు.

Samayam Telugu 14 Apr 2018, 9:53 pm
ఆ యువకుడికి పెళ్లైంది. నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఇంకో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ విషయం తెలియడంతో భార్య అతన్ని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు ప్రియురాలు తన కుటుంబ సభ్యులతో వచ్చి ఆ యువకుడిపై దాడికి దిగింది. తీవ్రంగా అవమానించింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu Suicide
నమూనా చిత్రం


జిల్లాలోని శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన మామిడి సారయ్య కుమారుడు కమలాకర్ (25)కు భార్య సరిత, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కొంతకాలం క్రితం రేపాకకు చెందిన యువతితో కమలాకర్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంటి దగ్గర ఉన్నప్పటికీ ప్రియురాలితోనే కమలాకర్ ఎక్కువగా చాటింగ్ చేస్తూ ఉండేవాడు. దీంతో ఈ విషయం కమలాకర్ భార్య సరితకు తెలిసిపోయింది. భర్తతో గొడవపెట్టుకున్న సరిత పుట్టింటికి వెళ్లిపోయింది.

మరోవైపు ప్రియురాలికి కమలాకర్‌కు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. గొడవలు కూడా జరిగాయి. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో హసన్‌పర్తి నల్లగట్టుగుట్ట సమీపంలో పెట్రోల్ బంకు ఎదురుగా ఓ ఇంట్లో కమలాకర్ అద్దెకు ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. శనివారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుని కమలాకర్‌ను చితకబాదింది. యువతి బంధువులు కమలాకర్‌తో ఆమె కాళ్లకు మొక్కించారు. ఇదంతా సెల్‌ఫోన్‌లో వీడియో తీశారని స్థానికులు చెబుతున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన కమలాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తన ప్రియురాలు చేసిన అవమానాన్ని తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మరణానికి ఆమే కారణమని సూసైడ్ నోట్‌లో కమలాకర్ రాశాడు. ఎల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని జయగిరి రైల్వే గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కమలాకర్ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని అతని తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.