యాప్నగరం

మేడారం చిన్న జాతరకు సర్వం సిద్ధం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

TNN 8 Feb 2017, 1:48 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో మినీ మేడారం జాతరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచి 11వ తేదీ వరకు ఈ మినీ జాతర నిర్వహిస్తారు. భక్తులు ఇవాళ సమ్మక్కకు.. రేపు సారలమ్మకు పూజలు నిర్వహిస్తారు. 10, 11తేదీల్లో వనదేవతలకు గ్రామీణులు ప్రత్యేక పూజలు చేస్తారు. మేడారం మెగా జాతరకు ముందు నిర్వహించే ఈ పండగను మెలిగే పండగ అని కూడా అంటారు. ప్రభుత్వం ఈ చిన్న జాతరను 2007 నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది.
Samayam Telugu medaram sammakka sarakka mini jatara begins
మేడారం చిన్న జాతరకు సర్వం సిద్ధం


జాతర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. జిల్లా కేంద్రాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు వేశారు. భద్రత ఏర్పాట్లతో పోలీసు శాఖ కూడా సన్నద్ధమైంది. చిలకలగుట్ట, జంపన్నవాగు, దేవాలయం సమీపంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మేడారం పరిసర ప్రాంతాల్లోని చేతి పంపులను బాగు చేసి తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

సాధారణంగా భక్తులు జంపన్నవాగులో పుణ్య స్నానమాచరించి అమ్మల దర్శనానికి వెళతారు. ప్రస్తుతం వాగులో నీరు లేకపోవడంతో అధికారులు భక్తులకు జల్లు స్నానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్లకు మరమ్మతులు చేశారు. క్యూలైన్లపై చలువ పందిళ్లు వేశారు. విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్తు శాఖ ఏర్పాట్లు చేసింది.

మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి మంగళవారం నుంచే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవార్లకు బంగారం, వస్త్రాలు, వడి బియ్యంతో పాటు వెండి కుంకుమ భరిణిలు సమర్పించి ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.