యాప్నగరం

మిషన్ క్యాచ్ మంకీస్.. కోతుల కోసం రూ.30 కోట్లు!

కోతిని మనం దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోతి మనకు చుక్కలు చూపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Samayam Telugu 3 Apr 2018, 3:39 pm
కోతిని మనం దైవంగా భావిస్తాం. కానీ ఇప్పుడు ఆ కోతి మనకు చుక్కలు చూపిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి చొరబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో కోతుల బెడద ఎక్కువైపోయింది. మహానగరం హైదరాబాద్‌లోకి కూడా వానరాలు చొరబడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాద్ జిల్లాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. కోతుల బెడదతో ఈ జిల్లాల్లోని కొన్ని గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పంటలను పాడు చేయడమే కాకుండా ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడి మహిళలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి.
Samayam Telugu Monkey

కోతుల బెడద రోజురోజుకీ తీవ్రతరం అవుతుండటంతో వీటిని తిరిగి అడవులకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. రెండేళ్ల క్రితమే కార్యచరణను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కోతులు పట్టుకునేవాళ్లను రంగంలోకి దింపింది, బాణసంచా ఉపయోగించి వాటిని అడవుల్లోకి పంపే ప్రయత్నం చేసింది. కానీ ఫలించలేదు. ఆఖరికి కొన్ని గ్రామాల్లోని ప్రజలు స్వయంగా కర్రలు చేతబట్టి కోతులను తరిమే కార్యక్రమానికి పూనుకున్నారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. సాధారణంగా కొండ ముచ్చులను చూస్తే కోతులు పారిపోతాయి. అందుకనే అటవీశాఖ అధికారులు ఈ ప్రయోగాన్ని కూడా చేశారు. కానీ కొండముచ్చులను కూడా తరిమికొట్టే స్థాయికి కోతులు ఎదిగిపోయాయి. కోతులపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చర్చను కూడా లేవనెత్తారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో దీనికి దీర్ఘకాలిక పరిష్కారం ఆలోచించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీని కోసం సంబంధిత శాఖల అధికారులతో చర్చలు జరిపారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సూచన మేరకు నిపుణుల కమిటీని కూడా నియమించారు. ఈ నిపుణుల కమిటీ తొలి సమావేశం సోమవారం (ఏప్రిల్ 2న) హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో జరిగింది. కోతుల బెడద నుంచి రైతులను, ప్రజలను రక్షించేందుకు వారు ఒక కార్యచరణను రూపొందించారు. ఈ ప్రణాళిక ప్రకారం కోతులను బంధించి తిరిగి అడవులకు పంపడానికి కనీసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.