యాప్నగరం

మావోల మెరుపుదాడితో ఏఓబీలో హైఅలర్ట్

గత కొద్దికాలంగా ఏజెన్సీలో స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా పంజా విసిరారు. విశాఖ జిల్లాలోని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలపై మావోయిస్టులు కాల్పలకు తెగబడ్డారు

Samayam Telugu 23 Sep 2018, 4:07 pm
విశాఖపట్టణం జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనతో ఏపీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు జిల్లాల్లో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, పర్యటనల్లో ఉన్న నేతలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సూచించింది. ముఖ్యంగా ఏజెన్సీలో నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మరోవైపు ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. గత కొద్ది రోజులుగా గ్రౌహండ్స్ దళాలు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా ఏఓబీలో ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో పాల్గొన్న 60 మంది మావోయిస్టుల బృందంలో 40 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనకు ముందు కిడారి సర్వేశ్వరరావుతో దాదాపు గంట సేపు మావోయిస్టులు మాట్లాడినట్టు తెలుస్తోంది.
Samayam Telugu అరకు ఎమ్మెల్యే దాడి


మరోవైపు మావోయిస్టుల మెరుపు దాడిపై విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్తుండగా వారి వాహనాలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మావోయిస్టులు అడ్డగించినట్టు తెలిపారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వ్యక్తిగత భద్రతా సిబ్బంది వద్ద ఆయుధాలను లాక్కున్న మావోయిస్టులు, అనంతరం కాల్పులు జరిపినట్టు తెలియజేశారు. ఒడిశా సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుందని, కారణాలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని డీఐజీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలను విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు.

సంచలనం కోసమే మావోలు ఈ హత్యలకు పాల్పడినట్టు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సీతారామారావు వ్యాఖ్యానించారు. ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లో భయాందోళన కలిగించి, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఎన్నికల ముందర ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వానికి సవాలేనని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ఉనికిని చాటుకుని.. మన్యంలో తాము బలపడుతున్నామన్న సంకేతాలను పంపడానికే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని సీతారామారావు పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన ఈ ఘటనతో ప్రజాప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.