యాప్నగరం

ఎమ్మెల్సీలుగా బాబు ఛాయిస్, వాళ్లిద్దరే..?!

గవర్నర్ కోటాలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ పదవులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

TNN 15 Jul 2017, 9:49 am
గవర్నర్ కోటాలో భర్తీ కానున్న రెండు ఎమ్మెల్సీ పదవులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికి కేటాయిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఆశావహుల జాబితా పెద్దదే. అయితే.. ఇప్పటికే ఈ విషయంలో బాబు ఒక అభిప్రాయానికి వచ్చేశారనే మాట వినిపిస్తోందిప్పుడు. ఈ రెండు పదవుల విషయంలో బాబు ఇద్దరిని ఎంపిక చేశారట.
Samayam Telugu mlc chances for farukh and subbareddy
ఎమ్మెల్సీలుగా బాబు ఛాయిస్, వాళ్లిద్దరే..?!


నంద్యాలకు చెందిన టీడీపీ సీనియర్ ఫరూక్, జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత రామసుబ్బారెడ్డిలను గవర్నర్ కోటాలో బాబు ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయనున్నాడని సమాచారం. ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. వీరిని ఎంపిక చేయడం వెనుక రెండు వేర్వేరు వ్యూహాలున్నాయి.

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేర్చుకున్నారు చంద్రబాబు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీంతో రామసుబ్బారెడ్డి అసమ్మతివాదిగా తయారయ్యారు. తన రాజకీయ ప్రత్యర్థిని పార్టీలోకి చేర్చుకోవడం, మంత్రి పదవి ఇవ్వడం పట్ల సుబ్బారెడ్డి అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి శాంతపరచాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం.

ఇక నంద్యాల్లో పార్టీని గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని ఇటీవలే ఫరూక్ కు బాబు హామీని ఇచ్చారు. నంద్యాల్లో పెద్ద ఎత్తున ముస్లిం ఓటర్లున్నారు. ఫరూక్‌కు పదవిని ఇవ్వడం ద్వారా వారినీ ఆకట్టుకోవచ్చనేది బాబు వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఫరూక్, రామసుబ్బారెడ్డిలకు బాబు ఎమ్మెల్సీ పదవులను ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.