యాప్నగరం

శాసనమండలి చైర్మన్‌గా ఫరూక్ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌‌గా ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

TNN 15 Nov 2017, 4:51 pm
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌‌గా ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఈ స్థానంలో ఎ.చక్రపాణి ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం గత మే నెలలో ముగియడంతో చైర్మన్ సీటు ఖాళీ అయ్యింది. 2011లో గవర్నర్‌ కోటాలో ఎంపికైన చక్రపాణి.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ జులైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. నంద్యాల నియోజకవర్గం నుంచి ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. కచ్చితంగా ముస్లింను రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ను చేస్తానని నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నమాట నిలబెట్టుకున్నారు.
Samayam Telugu n m farooq takes charge as ap legislative council chairman
శాసనమండలి చైర్మన్‌గా ఫరూక్ బాధ్యతల స్వీకరణ


శాసనమండలి చైర్మన్ పదవికి మంగళవారం ఫరూక్ నామినేషన్ వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌తో పాటు మరో పది మంది ఎమ్మెల్సీలు సంతకాలు చేశారు. ఈ పదవికి ఫరూక్ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం మండలి చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన ఫరూక్.. తక్షణమే బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూక్.. 1983లో నంద్యాల మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరవాత 1985-88, 1999-2004 కాలంలో రాష్ట్ర మంత్రిగాను సేవలందించారు.

ఇదిలా ఉంటే.. మండలి చీఫ్ విప్‌గా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. అలాగే డొక్కా మాణిక్య వరప్రసాద రావు, బుద్ధ వెంకన్న, రామ సుబ్బారెడ్డి, షరీఫ్‌లను శాసనమండలి విప్‌లుగా నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.