యాప్నగరం

Nara Lokesh: వైఎస్ జగన్ కల నెరవేరింది

World Bank | నవ్యాంధ్ర కలల రాజధాని ఇక కలగానే మిగిలిపోతుందని నారా లోకేశ్ అన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకున్న అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 19 Jul 2019, 9:01 pm
ఆంధ్రుల కలల రాజధాని ఇక కేవలం కలగానే మిగిలిపోతుందేమోనని మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ట్విటర్ వేదికగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే కార్యాచరణలో వైఎస్ జగన్ మొదటి అడుగు విజయవంతంగా వేశారని ఎద్దేవా చేశారు. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని.. ఏపీ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై శుక్రవారం (జులై 19) సాయంత్రం వరస ట్వీట్లు చేసిన లోకేశ్.. జగన్ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు.
Samayam Telugu amaravati
అమరావతి


‘జగనన్న వచ్చారు, వరల్డ్ బ్యాంక్ పోయింది. జగన్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది. బాబుగారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయ్యింది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

పనిలో పనిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పైనా లోకేశ్ విమర్శలు చేశారు. ‘ఇంత జరిగిన తర్వాత కూడా మంత్రి బుగ్గన గారు.. 2006లోనే వైఎస్ అధిక వడ్డీకి మీరు ఆంధ్రాకి లోన్ ఇవ్వొద్దు అంటూ వరల్డ్ బ్యాంక్‌కి లేఖ రాశారు.. అందుకే ఆయనపై ఉన్న గౌరవంతో వెనక్కి వెళ్లారు అని లేఖ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు’ అని ఎద్దేవా చేశారు.

రాజధాని నిర్మాణానికి రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా.. వరల్డ్ బ్యాంక్ ఆ రుణ సహాయాన్ని నిలిపేసింది. 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయాన్ని కోరగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. గురువారం సాయంత్రం వరల్డ్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.