యాప్నగరం

Nipah Virus: హైదరాబాద్‌లో నిపా కలకలం.. అనుమానితుడు ఇటీవలే కేరళకు!

కేరళను వణికిస్తున్న నిపా వైరస్ హైదరాబాద్‌లోనూ కలకలం సృష్టిస్తోంది. నగరంలో ఇద్దరు వ్యక్తులకు నిపా వైరస్‌ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే.. ఎలాంటి భయం అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు.

Samayam Telugu 25 May 2018, 6:37 pm
కేరళను వణికిస్తున్న నిపా వైరస్ హైదరాబాద్‌లోనూ కలకలం సృష్టిస్తోంది. నగరంలో ఇద్దరు వ్యక్తులకు నిపా వైరస్‌ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వీరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న ఒకరు కొద్ది రోజుల కిందటే కేరళ వెళ్లి వచ్చారు. దీంతో ఆందోళన నెలకొంది. ఇరువురి రక్త నమూనాలను శుక్రవారం (మే 25) పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపించారు. శనివారం ఉదయానికి నివేదిక అందుతుందని తెలంగాణ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కె రమేశ్ రెడ్డి తెలిపారు. అయితే.. భయపడాల్సిన పనేంలేదని, రిపోర్టు నెగెటివ్‌గా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.
Samayam Telugu nipah


ఆందోళన అక్కర్లేదు..
కేరళలో నిపా వైరస్‌కు చికిత్స అందిస్తున్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) అధికారులతో మాట్లాడినట్లు రమేశ్ రెడ్డి తెలిపారు. అనుమానితుడు కేరళలో వెళ్లొచ్చిన ప్రాంతానికి, నిపా వైరస్‌ సోకిన ప్రాంతానికి వందల కిలోమీటర్ల దూరం ఉందని ఆయన వివరించారు. అందువల్ల భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని చెప్పారు. అత్యవసర సమయాల్లో స్పందించేందుకు అన్ని విధాలుగా సిద్ధం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆస్పత్రిలో సిబ్బంది భద్రత కోసం ప్రొటెక్టివ్‌ సూట్లను కూడా తెప్పిస్తున్నట్లు వెల్లడించారు.

కేరళ వెళ్లొద్దు.. కొరికిన గుర్తులున్న పండ్లు తినొద్దు
కేరళలో ప్రాణాంతక నిపా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను అక్కడికి పర్యటనకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అదేవిధంగా చెట్ల నుంచి రాలి పడిన, కొరికిన గుర్తు ఉన్న పండ్లను తినొద్దని ప్రజలను కోరారు. గ్రామాల్లో ప్రజలకు దీనిపై అవగాహన వచ్చేలా ఎన్‌జీవోలు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

‘నిపా బాధితుల కోసం ఓయూ, గాంధీ, ఫీవర్ ఆస్పత్రి, నిలోఫర్, వరంగల్ ఆస్పత్రి, మహబూబ్ నగర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. ఎమర్జన్సీ వార్డులను కూడా అందుబాటులో ఉంచాం. నిపా సోకితే మాటలు తడబడతాయి. శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తుతుంది. వ్యాధిగ్రస్థులు దగ్గినా, తుమ్మినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. మూత్రం, చెమట, తెమడ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది’ అని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు.

ఆందోళనకు కారణమిదే..
కేరళలో ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటివరకూ 13 మంది మృతి చెందారు. మరో 22 మంది నిపా వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల కిందట కర్ణాటకలోనూ ఇద్దరు వ్యక్తుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు. గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందే ఈ నిపాకు ప్రత్యేకమైన వైద్యం, వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.