యాప్నగరం

ఖైరతాబాద్‌ గణపతి: ఏడేళ్ల సంప్రదాయానికి తెర!

ఖైరతాబాద్‌ వినాయకుడికి ఉన్న క్రేజే వేరు. ఇక ఆయన లడ్డూకున్న ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

TNN 14 Aug 2017, 2:05 pm
ఖైరతాబాద్‌ వినాయకుడికి ఉన్న క్రేజే వేరు. ఇక ఆయన లడ్డూకున్న ప్రాశస్త్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భారీ గణనాథుడి కోసం అంతే స్థాయిలో భారీ లడ్డూను చేయిస్తారు నిర్వాహకులు. ఇలాంటి లడ్డూ కోసం భక్తులు వేల సంఖ్యలో పోటీపడటం ఏటా మామూలే. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఏడేళ్లుగా ఖైరతాబాద్ గణపతి కోసం లడ్డూ వస్తోంది. అయితే.. ఈ సంప్రదాయానికి ఈ ఏడాదితో బ్రేక్‌ పడనుంది. ఈ ఏడాది నుంచి భారీ లంబోదరుడి లడ్డూను స్థానికంగానే తయారు చేయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Samayam Telugu no more tapeswaram laddu for khairatabad ganesh
ఖైరతాబాద్‌ గణపతి: ఏడేళ్ల సంప్రదాయానికి తెర!


తాపేశ్వరానికి చెందిన ‘సురుచి ఫుడ్స్‌’ అధినేత మల్లిబాబు.. 2010 నుంచి ఖైరతాబాద్‌ గణపతి కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. ఈ లడ్డూ పలుమార్లు గిన్నిస్ బుక్‌లోనూ చోటు దక్కించుకుంది. గణపతి నిమజ్జనం తర్వాత మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు. 2013లోనూ ఇలాగే 4,200 కిలోల లడ్డూలో మల్లిబాబుకు కొంత ఇచ్చి.. మిగతాది భక్తులకు పంచాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. అయితే లడ్డూ పంపిణీలో వాటాపై కమిటీ సభ్యుల్లో గొడవ జరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత లడ్డూ పంపిణీ నిలిపేశారు.

అంతకుమందు కూడా ఓసారి మల్లిబాబు ఖైరతాబాద్ గణేషుడి లడ్డూ ప్రసాదాన్ని తాపేశ్వరానికి తీసుకెళుతుండగా హైదరాబాద్ శివార్లలో విజయవాడ హైవేపై వాగ్వాదం చోటు చేసుకుంది. తన బంధువులకు కొంత లడ్డూ ప్రసాదాన్ని ఇస్తుండగా జనం ఎగబడటంతో గందరగోళం తలెత్తింది. మరోసారి భారీ వర్షం వల్ల లడ్డూ పాడవడంతో వైద్యుల సూచన మేరకు భక్తులకు పంచకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో 2016లో లడ్డూను తీసుకురావొద్దంటూ మల్లిబాబుకు నిర్వాహకులు చెప్పారు. అయినా.. ఆయన భక్తిభావంతో 500 కిలోల లడ్డూను తెచ్చి.. గణపతి పాదాల వద్ద సమర్పించారు. నిమజ్జనం అయ్యాక ఆ లడ్డూలో ఏమాత్రం మల్లిబాబుకు ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఈ ఏడాది లడ్డూ పంపించడంలేదని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.