యాప్నగరం

​బట్టబయలు: డ్రగ్స్ మత్తులో సినిమా వాళ్లు, విద్యార్థులు!

బాధితుల్లో హైస్కూల్ అమ్మాయిలు..

TNN 3 Jul 2017, 8:45 am
హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ దందా బట్టబయలు అయ్యింది. ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ డ్రగ్స్ దందాలో బడాబాబులు, స్కూల్ విద్యార్థులు వినియోగదారులు అని తేలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల కథనం ప్రకారం.. అమెరికా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను దిగుమతి చేసే దందా ఒకటి బట్టబయలైంది. అధికారులు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి ఈ వ్యవహారం కూపీ లాగారు. ముగ్గురు డ్రగ్స్ డీలర్లను పట్టుకోగలిగారు.
Samayam Telugu online drugs dealership busted
​బట్టబయలు: డ్రగ్స్ మత్తులో సినిమా వాళ్లు, విద్యార్థులు!


వారిని విచారించగా డ్రగ్స్ బాధితుల్లో అనేక మంది చిన్నపిల్లలు, కొందరు సినిమా వాళ్లు ఉన్నట్టుగా తేలింది. హైదరాబాద్‌లో బడాబాబుల పిల్లలు చదివే కొన్ని స్కూళ్లలోని విద్యార్థులను, ఒక బడా సినీ నిర్మాతను డ్రగ్స్ కొంటున్న వారిగా గుర్తించారు. ఆన్‌లైన్ ద్వారానే వీళ్లు డ్రగ్స్‌ను కొంటున్నారని తేల్చారు. ఫలానా మాదకద్రవ్యం కావాలని వీరు సదరు సైట్‌లో పోస్టు చేస్తే వారికి అందేలా డీలర్లున్నారని తేలింది.

ప్రధానంగా కొన్ని ప్రముఖ స్కూల్స్ విద్యార్థులు ఈ సైట్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారని, ఒకరి నుంచి మరొకరికి అలవాటుగా మారిందని అధికారులు వివరించారు. తొమ్మిదీ, పదో తరగతి విద్యార్థులకే ఈ విశృంఖల అలవాటు ఉందనే విస్మయకరమైన విషయాన్ని తెలిపారు. కోటీశ్వరులైన తల్లిదండ్రులు పిల్లల సంరక్షణపై శ్రద్ధ వహించకపోవడం, అవసరానికి మించిన స్థాయిలో డబ్బు అందుబాటులో ఉండటంతో పిల్లలు ఈ అలవాట్ల పాలైనట్టుగా విశ్లేషించారు.

అలాగే ఈ డ్రగ్స్ వ్యవహారంతో కొంతమంది సినిమా వాళ్లకు కూడా సంబంధాలున్నాయని వివరించారు. ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్ డీలర్లను సంప్రదించి వీరు కూడా వాటిని తెప్పించుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు సరఫరాదారులను అరెస్టు చేశారు. వీరి నుంచి దాదాపు పాతిక లక్షల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ చేస్తున్నామని ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.