యాప్నగరం

‘నేతలు అమ్ముడుపోతారేమో గానీ ప్రజలు, ప్రజానాయకులు కాదు’

ఏపీ విభజన హామీల అమలుపై వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేస్తోన్న జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు.

Samayam Telugu 6 Apr 2018, 3:07 pm
ఏపీ విభజన హామీల అమలుపై వామపక్షాలతో కలిసి ఉద్యమాలు చేస్తోన్న జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ శుక్రవారం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారిపై కమ్యూనిస్టు నేతలతో కలిసి పవన్ పాదయాత్ర చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ... నాయకులు అమ్ముడుపోతారేమో గానీ ప్రజలు, ప్రజానాయకులు అమ్ముడుపోరని అన్నారు. ప్రత్యేక హోదా కోసం అందరితో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విభజన సమయంలో ఆస్తులను తెలంగాణకు, అప్పులను ఆంధ్రాకు ఇచ్చారని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ‘ప్రత్యేక హోదాపై కేంద్రం మాటమార్చిందని, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది.. అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులనే పేరు మార్చి ప్యాకేజీ అన్నారు.. విభజన హామీలు కేంద్రం అమలు చేస్తుందని కొన్ని రోజులు వేచిచూశాం’ అని పవన్ అన్నారు.
Samayam Telugu పవన్ పాదయాత్ర


కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకుని సమర్దించారు... మళ్లీ మాట మార్చి నేడు ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు. కేంద్రంపై పోరాడటంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని పవన్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై తిరుపతిలో జరిగిన పార్టీ సభలో తొలిసారిగా తానే మాట్లాడానని, ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని చెప్పానని, అయినప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని చంద్రబాబు అన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సమర్థవంతమైన పాత్ర నిర్వహించలేకపోయిందని, వామపక్ష పార్టీలతో కలిసి జనసేన పోరాడుతోందని స్పష్టం చేశారు.

విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే తాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చానని, అయితే దానివల్ల ఫలితం లేకపోయిందని అన్నారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలపై ఎవ్వరూ మాట్లాడడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరుద్ధ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శించారు. విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారిపై సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణలతో కలిసి ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని మూడు పార్టీల నేతలు డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.