యాప్నగరం

అమరావతిలో జనసేన ప్రధాన కార్యాలయం ప్రారంభించిన పవన్

వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోన్న జనసేనాని ఏపీపైనే ఎక్కువగా దృష్టిసారించారు. ఇందులో భాగంగా ప్రజా పోరాట యాత్రలు నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 13 Oct 2018, 12:06 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ఉదయం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు సమయంలో జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయంలో మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పవన్ కల్యాణ్‌ను ఆశీర్వదించారు. తమ అభిమాన కథానాయకుడు, నేత రాకతో అమరావతికి ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పోటెత్తారు.
Samayam Telugu అమరావతి


అనంతరం మాజీ స్పీకర్ మనోహర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న ఐటీ దాడులు, రాష్ట్ర రాజకీయాలతోపాటు తెలంగాణ ఎన్నికలపై కూడా చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్షించారు. ఇక నుంచి పార్టీ కార్యకలాపాలు అమరావతి కేంద్రంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా పవన్ జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కవాతు అనంతరం పర్యటిస్తానని తెలిపారు. సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగించరాదనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అక్కడ పర్యటించడం లేదని అన్నారు. దృష్టంతా ప్రజలమీద ఉండాల తప్పా, నాయకుల పర్యటనలపై కాదని పేర్కొన్నారు. రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు మరింతగా శ్రమించాలని కోరారు.

అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలో తొలుత కొంత వివాదం చెలరేగింది. చినకాకాని దగ్గర ఓ రైతు వద్ద మూడున్నర ఎకరాల భూమిని లీజుకు తీసుకున్న పవన్ కల్యాణ్ గతేడాది డిసెంబరులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే, ఈ భూమిని యార్లగడ్డ సుబ్బారావు వారసుల నుంచి జనసేన పార్టీ తీసుకున్న లీజుకు చట్ట బద్దత లేదని ఆ స్థలం వారసుల తామేనంటూ కొంత మంది మైనారిటీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొహియుద్దీన్‌ అనే వ్యక్తి చెందిన చెందిన స్థలాన్ని పవన్‌కు సుబ్బారావు ఎలా లీజుకు ఇస్తారని ముస్లిం ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అనంతరం పవన్ జోక్యంతో ఇది సద్దుమణిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.