యాప్నగరం

సీఎం, సీఎం నినాదాలు.. ఫ్యాన్స్‌కు పవన్ చురకలు

సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తు నినాదాలు చేస్తూ.. పదే పదే తన ప్రసంగానికి అడ్డు వచ్చిన ఫ్యాన్స్‌కి పవన్ సుత్తిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు.

Samayam Telugu 10 Aug 2018, 8:42 pm
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. శుక్రవారం సాయంత్రం నర్సాపురంలో జనసైనికులను ఉద్దేశించి మాట్లాడారు. పవన్ మాట్లాడుతుండగా.. సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. పదే పదే తన ప్రసంగానికి అడ్డు వస్తుండంటంతో వారికి పవన్ సుత్తిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. మీరు సీఎం సీఎం అని అరిస్తే నేను సీఎం కాను. మీరు ఓటు హక్కు నమోదు చేసుకోండని జనసైనికులకు సూచించారు.
Samayam Telugu pk at narsapuram


‘‘మీ నుంచి కోరుకునేది ఇది కాదు. అరుపులు, కేకలతో మార్పు రాదు. ఆలోచనతో మార్పు వస్తుంది. బలమైన, నిర్దిష్ట ప్రణాళికతో మార్పులొస్తాయి. యువత బైకుల మీద తిరుగుతూ జెండాలు ఊపితే జనసేన గెలవదు. బాధ్యతగా మెలగండి. నాయకులకు గౌరవం ఇవ్వండి. పెద్దలను గౌరవించండ’’ని పవన్ తన అభిమానులకు సూచించారు.

చదవండి: బాబు, జగన్ కుటుంబాల మధ్య రాష్ట్రం నలిగిపోతోంది: పవన్

తన మాటలతో జనసైనికులు నొచ్చుకుంటారని భావించిన పవన్.. వారిని మళ్లీ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ‘‘మా వాళ్లు చిన్నపిల్లలు, మా వాళ్లకు ఉత్సాహం ఎక్కువ. జనసైనికులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని భీమవరం సభలో నన్ను అడిగారు. యువత ఏం చేస్తారు చెప్పండి. సరైన ఉద్యోగాలు లేవు. ఆడుకోవడానికి గ్రౌండ్లు లేవు. ఉపాధి లేదు. యువత ఏం చేస్తారు చెప్పండి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా.. యువత బైకుల మీద వెంట వస్తారు. ఇక్కడ పది మంది ఆడపడుచులు ఉంటే వారిని ఒక్కరు కూడా ముట్టుకోలేదు. యువతకు దిశానిర్దేశం చేయడానికి, ఆడపడుచులకు అండగా ఉండటానికి రాజకీయాల్లోకి వచ్చానం’’టూ జనసేనాని మాట్లాడారు.

‘‘నేను సినిమాల్లో సరదాగా ఉంటాను. కానీ రాజకీయాలను బాధ్యతగా తీసుకున్నా. సినిమాలు చేస్తే ఏడాదికి రూ.25 కోట్లు ట్యాక్స్ కట్టగలను. రెండు, మూడు సినిమాలు చేస్తే రూ.100 కోట్లు సంపాదించగలను. అధికారం నాకు బాధ్యత. ముఖ్యమంత్రి కావడం చాలా కష్టమైన పని. రాజకీయాల్లో చాలా సహనం కావాలి. మీ భవిష్యత్తు కోసమే రాజకీయాల్లోకి రాలేదు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా రాజకీయాల్లోకి వచ్చాన’’ని పవన్ తన సుదీర్ఘ రాజకీయ లక్ష్యాన్ని యువతకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు.

‘‘నాకు ఛానెల్స్ లేవు, న్యూస్ పేపర్లు లేవు, డబ్బులు లేవు. కానీ నా గుండె నిండా ధైర్యం ఉంది. మీరే ఛానెళ్లు, మీరే నా వార్తాపత్రికలు. సామాన్యుడిలా బతకడం ఇష్టం. ఏ మూలకెళ్లినా అన్నా అని పిలిచే మీరు ఉన్నారు. కోట్లు సంపాదించినా నాకు ఆనందం కనిపించలేదు. పది సినిమాలు హిట్టైనా లభించని ఆనందం మీకు అండగా ఉంటే లభిస్తోంద’’ని జనసేనాని ఉద్వేగంగా మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.