యాప్నగరం

ఆత్మహత్య కాదు హత్యే: కుటుంబ సభ్యులపై అనుమానం

హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో ఓ యువకుడి మృతిలో ఆలస్యంగా ఓ కొత్త కోణం బయటికి వచ్చింది.

TNN 12 Jun 2017, 8:34 am
హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో ఓ యువకుడి మృతిలో ఆలస్యంగా ఓ కొత్త కోణం బయటికి వచ్చింది. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక రాగానే ఆశ్చర్యపోయారు. తలకు బలమైన గాయాలు తగలడంవల్లే చనిపోయాడంటూ ఫోరెన్సిక్‌ నిపుణులు స్పష్టం చేశారు. దీంతో ఆత్మహత్య కేసును హత్య కేసుగా పోలీసులు మార్చారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి.
Samayam Telugu police suspects father and brother in a youth murder case in hyderabad
ఆత్మహత్య కాదు హత్యే: కుటుంబ సభ్యులపై అనుమానం


పరువు కోసం కన్నతండ్రి, అన్నయ్యలే ఈ హత్యచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని విచారించాక పూర్తి వివరాలు తెలియనున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని ఆర్‌.బి.నగర్‌కు చెందిన రైతు సోమేశ్వర్‌రెడ్డి కుమారుడు పరమేశ్వర్‌రెడ్డి(21) ఇంటర్మీడియట్‌ చదివి తండ్రి, అన్నయ్యలకు వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నాడు. పరమేశ్వర్‌రెడ్డి శంషాబాద్‌లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమించాడు. ఆమెనే పెళ్లిచేసుకుంటానంటూ తండ్రికి చెప్పాడు. దీనికి తండ్రి ససేమిరా అన్నాడు. అన్నయ్యలు కూడా పరమేశ్వర్‌రెడ్డి ప్రేమను ఒప్పుకోలేదు.

దీంతో కుటుంబసభ్యులకు చెప్పకుండా పెళ్లికి సిద్ధపడిన పరమేశ్వర్‌రెడ్డి మార్చి 27న అకస్మాత్తుగా మృతి చెందాడు. అన్నయ్యలతో గొడవపడటంతో పాటు తనకు ఉద్యోగం లేదన్న మనస్తాపంతో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు కథ అల్లారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. సమాచారం పోలీసులకు అందింది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పరమేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇటీవల పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందడంతో తొలిసారిగా పరమేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చింది. దీంతో దర్యాప్తు వేగవంతం చేసి, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. తమకు తెలియకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడనే పరమేశ్వర్‌రెడ్డిని కుటుంబ సభ్యులు హతమార్చి ఉంటారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. హత్యకేసు నమోదు చేశారు కాబట్టి త్వరలోనే నిందితులను అరెస్టు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.