యాప్నగరం

ఏపీ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

నవ్యాంధ్రను టెక్నాలజీ వైపు నడిపించాలని.. పరిశ్రమలు, విమానాశ్రయాలు, అణు విద్యుత్ కేంద్రాలతో ఆర్థికంగా పటిష్టం చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం నుంచి తీపి కబురు అందింది.

Samayam Telugu 29 May 2018, 9:43 pm
నవ్యాంధ్రను టెక్నాలజీ వైపు నడిపించాలని.. పరిశ్రమలు, విమానాశ్రయాలు, అణు విద్యుత్ కేంద్రాలతో ఆర్థికంగా పటిష్టం చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్రం నుంచి తీపి కబురు అందింది. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసి టీడీపీ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లు‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదించారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన గెజిట్‌ను కేంద్రం విడుదల చేయనుంది.
Samayam Telugu land


భూసమీకరణలో భూమిని ఇవ్వడానికి ఒప్పుకోని వారి నుంచి భూసేకరణ చేయడం కోసం ‘2013 భూ సేకరణ చట్టం’కు సవరణ చేస్తూ 2017 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ఆమోదించింది. అంతకు ముందు గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు సవరించిన విధంగానే కీలకమైన సామాజిక ప్రభావ సర్వే, భూయజమానుల అంగీకారం, నష్టపరిహారం, పునరావాసం, పునర్నిర్మాణం వంటి నిబంధనలన్నిటినీ సడలించింది. కిందటేడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుకు మరిన్ని మార్పులు చేస్తూ నవంబర్ చివర్లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో బిల్లును ఆమోదించింది. దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది కాబట్టి ఇక ఇది చట్టంగా మారనుంది.

ఈ సవరణ చట్టం అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను కూడా సేకరించే అవకాశం ఉంది. కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. దేశ రక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, విద్యుదీకరణ ప్రాజెక్టులు, గృహనిర్మాణం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నెలకొల్పే పారిశ్రామిక కారిడార్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు తదిరాలకు భూసేకరణ చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారీగా భూమిని సేకరించాలనుకున్నప్పుడు బహుళ పంటలు పండే భూములకు మినహాయింపు, సామాజిక ప్రభావం అంచనా, భూ యజమానుల అంగీకారం, గ్రామసభల ఆమోదం, రెట్టింపు పరిహారం వంటి నిబంధనలు వర్తించవని సవరణ బిల్లులో పేర్కొన్నారు. అంటే ఈ సవరణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణకు ఏపీ ప్రభుత్వానికి చాలా అడ్డంకులు తొలగినట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.