యాప్నగరం

‘దీక్షితుల ఆరోపణల్లో నిజం లేదు.. జూన్ 28 శ్రీవారి నగల ప్రదర్శన’

గత కొద్ది రోజులుగా టీటీడీపై శ్రీవారి ఆలయం మాజీ అర్చకుడు రమణదీక్షితులు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. శ్రీవారి విలువైన ఆభరణాలలో కొన్ని కనిపించకుండా పోయాయని ఆరోపించారు.

Samayam Telugu 25 Jun 2018, 8:05 am
గత కొద్ది రోజులుగా టీటీడీపై శ్రీవారి ఆలయం మాజీ అర్చకుడు రమణదీక్షితులు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. శ్రీవారి విలువైన ఆభరణాలలో కొన్ని కనిపించకుండా పోయాయని, వాటిని విదేశాలాకు తరలించారంటూ ఆయన ఆరోపించారు. రమణదీక్షితుల ఆరోపణలపై టీటీడీ ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు శ్రీవారి ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ టీటీడీ ప్రకటించింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. స్వామివారి ఆభరణాలను జూన్ 28 న మీడియా ముందు ప్రదర్శిస్తామని తెలిపారు. శ్రీవారికి చెందిన కొన్ని నగలు మాయమైనట్టు రమణదీక్షితులు చేస్తోన్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన, ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
Samayam Telugu శ్రీవారి ఆభరణాలు


ఈ వ్యవహారంపై జూన్ 26 న పాలక మండలి సమావేశం నిర్వహించి, విధివిధానాలను ఖరారు చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. అనంతపురం జిల్లా యాదవ సంఘం ఆదివారం నాడు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆభరణాలు, విలువైన సంపదలు 1950 నుంచి పాలక మండలి ఆధ్వర్యంలో భద్రంగా ఉన్నాయని సుధాకర్ యాదవ్ అన్నారు. రమణదీక్షితుల ఆరోపణలు నిరాధరమైనవి మండిపడ్డారు. శ్రీవారి ఆభరణాలు, సంపద విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలంటూ కోర్టులో రమణదీక్షితులు పిల్ దాఖలు చేశారు. ఈ అంశంపై జులైలో నిరసన దీక్ష కూడా చేపట్టనున్నట్టు తెలియజేశారు.

శ్రీనివాసుడికి చెందాల్సిన కానుకలను రమణ దీక్షితులు కొల్లగొట్టారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ సిరిపురపు శ్రీధర్‌ ఆరోపించారు. గుంటూరులోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ వీఐపీ దగ్గర యజ్ఞం చేసి స్వామివారికి 33 వెండి బిందెలు అవసరమని తీసుకున్న రమణ దీక్షితులు వాటిని తన ఇంటికి తరలించుకున్నారని ఆరోపించారు. ఆయన మనుమడు ఆగమ పరీక్షల్లో తప్పినా అర్చకునిగా తీసుకోవాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.