యాప్నగరం

నేటి నుంచి ఎక్స్‌ప్రెస్‌గా రాయగడ పాసెంజర్

ఒడిశాలోని రాయగడ నుంచి విజయవాడకు విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రాయగడ-విజయవాడ పాసెంజర్ సర్వీసు నేటి నుంచి ఎక్స్‌ప్రెస్‌గా మారుతోంది.

Samayam Telugu 2 Apr 2018, 10:17 am
ఒడిశాలోని రాయగడ నుంచి విజయవాడకు విశాఖ మీదుగా రాకపోకలు సాగించే రాయగడ-విజయవాడ పాసెంజర్ సర్వీసు నేటి నుంచి ఎక్స్‌ప్రెస్‌గా మారుతోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ పాసెంజర్ రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చడం పట్ల సాధారణ ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ధరలు పెంచడం, విశాఖ-విజయవాడ మధ్య హాల్టులు ఎత్తివేయడం. విశాఖ-రాయగడ మార్గంలోని హాల్ట్‌లను యథావిధిగా కొనసాగిస్తూనే విశాఖ-విజయవాడ మధ్య కొన్ని హాల్టులను ఎత్తివేయడం విమర్శలకు తావిస్తోంది.
Samayam Telugu Rayagada_Express


మరోవైపు, ఇప్పటి వరకు చాలా తక్కువ ధరకే ఈ రైలులో సాధారణ ప్రజలు ప్రయాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌గా మార్చడంతో ఛార్జీలు కూడా పెంచేశారు. కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ. 30 పెంచారు. ఇప్పటి వరకు విశాఖ నుంచి విజయవాడకు రూ.70 చెల్లించిన ప్రయాణికులు.. ఇకపై రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే విశాఖ నుంచి రాయగడకు రూ. 40 చెల్లిస్తుండగా.. ఇకపై రూ. 70 చెల్లించాలి. దీంతో దక్షిణ మధ్య రైల్వే యంత్రాంగం తీరుపై సాధారణ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు విజయవాడ-రాయగడ మధ్య 65 హాల్ట్‌లు ఉండగా ఇప్పుడు 40కు కుదించారు. ఎత్తివేసిన హాల్ట్‌లన్నీ విశాఖ-విజయవాడ మధ్యలోనివే. దువ్వాడ దాటిన తరవాత వచ్చే తాడి, కశింకోట, బయ్యవరం, నర్సింగపల్లి, రేగుపాలెం, గుల్లిపాడు స్టేషన్లలో హాల్ట్‌లను ఎత్తివేశారు. వాస్తవానికి విశాఖ జిల్లాలోని చాలా గ్రామాలకు చెందిన ప్రజలకు నగరానికి చేరుకోవడానికి కాకినాడ-విశాఖ పాసెంజర్, రాయగడ పాసెంజర్ రైళ్లే దిక్కు. అలాంటిది ఇప్పుడు వాటిలో ఒక రైలును ఎక్స్‌ప్రెస్‌గా మార్చేసి హాల్టులు ఎత్తివేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.