యాప్నగరం

రుయా టెన్షన్: డాక్టర్, క్లర్క్ ఆత్మహత్యాయత్నం

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ వైపు జూనియర్ డాక్టర్ల ఆందోళనలు చేస్తుండగా.. ఇప్పుడు మరో వివాదం అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు తెరతీసింది.

TNN 22 Sep 2017, 11:55 am
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఓ వైపు జూనియర్ డాక్టర్ల ఆందోళనలు చేస్తుండగా.. ఇప్పుడు మరో వివాదం అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు తెరతీసింది. డాక్టర్, క్లర్క్ మధ్య తలెత్తిన వివాదం చివరికి వారిద్దరి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరమణకు, పరిపాలనా విభాగం క్లర్క్ కృష్ణకుమారికి మధ్య ఇటీవల గొడవ జరిగింది. తనకు జరిగిన అవమానానికి మనస్తాపం చెందిన వెంకటరమణ.. వసతిగృహంలోనే శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్తించిన జూనియర్‌ వైద్యులు ఆయన్ని అత్యవసర విభాగానికి తరలించి చికిత్స అందించారు.
Samayam Telugu resident doctor and clerk committed suicide in tirupati ruia hospital
రుయా టెన్షన్: డాక్టర్, క్లర్క్ ఆత్మహత్యాయత్నం


ఈ నేపథ్యంలో ఈ సంఘటనకు కారణమైన రుయా పరిపాలనా విభాగం క్లర్క్‌ కృష్ణకుమారి కూడా ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ నెల 18న తనపై దుర్భాషలాడిన కృష్ణకుమారిపై చర్యలు తీసుకోలేదన్న మనస్తాపంతో రెసిడెంట్‌ డాక్టర్‌ వెంకటరమణ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై గత మూడు రోజులుగా జూనియర్ డాక్టర్లు ఇక్కడ ఆందోళన చేస్తున్నా ఆస్పత్రి వర్గాలు కానీ, జిల్లా కలెక్టర్ కానీ పట్టించుకోకపోవడంతో.. మనస్తాపం చెందిన వెంకటరమణ బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది.

వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న సబ్‌కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ శుక్రవారం రుయా ఆస్పత్రికి వచ్చారు. వెంకటరమణ ఆరోగ్య పరిస్థితి గురించి రుయా సూపరింటెండెంట్‌ సిద్ధానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ వివాదం తన మెడకు చుట్టుకునేలా ఉందని భావించే కృష్ణకుమారి కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న స్పందించారు. వివాదానికి కారణమైన సంబంధిత క్లర్క్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని రుయా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.