యాప్నగరం

వర్సిటీ నుంచి పరిహారం అందుకున్న రోహిత్ తల్లి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రెండేళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

TNN 22 Feb 2018, 9:45 am
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రెండేళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయం అధికారుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతడి తల్లి రాధిక వేముల ఆరోపించారు. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ చేస్తోన్న రోహిత్ వేముల 2016 జనవరి 17 న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీసీ వేధింపుల వల్ల రోహిత్ చనిపోయాడని అతడి కుటుంబం మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు రోహిత్ మరణానంతరం అతడి కుటుంబానికి రూ.8 లక్షలు పరిహారం చెల్లించడానికి హెచ్‌సీయూ ముందుకొచ్చింది.
Samayam Telugu rohith vemulas mom accepts rs 8 lakh from hyderabad university
వర్సిటీ నుంచి పరిహారం అందుకున్న రోహిత్ తల్లి


అయితే ఈ పరిహారాన్ని స్వీకరించేందుకు రోహిత్ తల్లి రాధిక మొదట నిరాకరించారు. ఈ కేసులో తాను నోరు విప్పకూడదనే కారణంతో ఆ సొమ్ము ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని రాధిక ఆరోపించారు. కానీ ఎట్టకేలకు నష్టపరిహారం స్వీకరించేందుకు రాధిక వేముల అంగీకరించారు. వర్సిటీ అందజేసిన రూ.8 లక్షల సొమ్మును ఆమె స్వీకరించారు. ఆ మొత్తాన్ని తన మనవడు (ఇతనికి రోహిత్ వేముల పేరు పెట్టారు) చదువు కోసం ఖర్చు చేస్తానని ఆమె తెలిపారు. పరిహారం తీసుకున్నంత మాత్రాన వీసీ అప్పారావు, కేంద్ర మాజీ మంత్రులపై తన పోరాటం ఆగదని, వారికి శిక్షపడే వరకు విశ్రమించబోనని రాధిక దీనిపై ప్రెస్ నోట్ విడుదలచేశారు.

జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాల ప్రకారం పరిహారం తీసుకోడానికి అంగీకరించానని, వీసీ అప్పారావు ఆజ్ఞతో కాదని మండిపడ్డారు. నా కుమారుడు దళితుడేనని పీఎల్ పూనియా అధ్యక్షత జాతీయ ఎస్సీ కమిషన్ ధ్రువీకరించిందని మరోసారి తెలిపారు. ఫిబ్రవరి 20 న రాధిక వేముల నష్టపరిహారాన్ని స్వీకరించినట్లు వర్సిటీ అధికార ప్రతినిధి వినోద్ పర్వాలా తెలిపారు. వర్సిటీ అధికారులతో తనకు రహస్య ఒప్పందం కుదిరందనే ప్రచారంలో నిజంలేదని, పరిహారం తీసుకున్న మాట వాస్తవమేనని ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.