యాప్నగరం

​టీడీపీ.. తన కులాన్ని మాత్రమే చూసిందంటున్న రోజా!

తెలుగుదేశం పార్టీలో తనను కేవలం కులం ప్రాతిపదికనే చూశారు తప్ప.. పార్టీ కోసం పని చేసిన తన నిజాయితీని పట్టించుకోలేదని రోజా అన్నారు

TNN 29 Mar 2017, 9:08 am
తెలుగుదేశం పార్టీలో తనను కులం ప్రాతిపదికన మాత్రమే చూశారు.. అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి ఆర్కే రోజా. గతంలో తెలుగుదేశం పార్టీలో దాదాపు పదేళ్ల పాటు పని చేసిన నేపథ్యం ఉన్న రోజా తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. 1999 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాను అని రోజా చెప్పారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున 26 రోజుల పాటు ప్రచారం చేశానని, ఆ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పని చేశాను అని ఆమె చెప్పారు.
Samayam Telugu roja on tdp memories
​టీడీపీ.. తన కులాన్ని మాత్రమే చూసిందంటున్న రోజా!


2004 టీడీపీ తరపున పోటీ చేయమని చంద్రబాబు అడిగారని, తను వాయల్పాడు నియోజకవర్గం టికెట్ కోరగా, తనకు నగరి సీటును కేటాయించారని రోజా చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో తన విజయం కోసం పార్టీ సహకరించలేదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఓటమి పాలయ్యానన్నారు. అంతటితో నిరాశ పడక.. ఆ తర్వాతి ఐదేళ్లూ నగరి నియోజకవర్గంలోనే పని చేశానని, అక్కడ తను బేస్ ఏర్పరుచుకుంటే.. ఎన్నికలకు రెండ్రోజుల ముందు పార్టీలోకి వచ్చిన గాలి ముద్దు కృష్ణమనాయుడికి పార్టీ టికెట్ కేటాయించారని, తనను చంద్రగిరి నుంచి పోటీ చేయించారని.. దీంతో తనకు పరాజయం తప్పలేదన్నారు.

తెలుగుదేశం పార్టీలో తనను కేవలం కులం ప్రాతిపదికనే చూశారు తప్ప.. పార్టీ కోసం పని చేసిన తన నిజాయితీని పట్టించుకోలేదని రోజా అన్నారు. 2009లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాకా చిత్తూరు జిల్లాకు బెల్ ప్రాజెక్ట్ వచ్చిందని, తమ జిల్లాకు అంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వైఎస్ కు కృతజ్ఞత చెప్పేందుకే తను ఆయనను కలిశానని.. దాంతో తనపై తెలుగుదేశం పార్టీ నుంచి మాటల దాడి మొదలైందని.. ఇక చేసేది లేక తను ఆ పార్టీకి దూరం అయ్యానని ఆమె చెప్పారు.

వైఎస్ మరణానంతరం తనను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా.. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు కోరారు అని, అయితే వైఎస్ జగన్ పిలుపు మేరకు తను వైకాపాలో చేరానని, జగన్ తనకు గుర్తింపును ఇచ్చారని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని రోజా చెప్పుకొచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.