యాప్నగరం

జనం మీదికి ఆర్టీసీ బస్సు.. ముగ్గురి మృతి

విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు విఫలమవడంతో జనంపైకి దూసుకెళ్లింది.

TNN 27 Oct 2017, 10:56 am
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు విఫలమవడంతో జనంపైకి దూసుకెళ్లింది. నాలుగు బైకులను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు విడిచారు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గవర్నర్‌పేట డిపోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు శుక్రవారం ఉదయం గన్నవరం, వాంబేకాలనీ మీదుగా విజయవాడ బస్టాండ్‌కు వెళ్తోంది. మార్గంలో బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది.
Samayam Telugu rtc bus crosses the crowd in vijayawada three dead
జనం మీదికి ఆర్టీసీ బస్సు.. ముగ్గురి మృతి


నాలుగు ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లింది. ఆ సమంయలో బస్సు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ప్రమాదాన్ని గమనించి చాకచక్యంగా బస్సుకు అడ్డంగా లారీని పెట్టాడు. దీంతో లారీని బలంగా ఢీకొని బస్సు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కురిషేద్‌(40) అనే మహిళ, హుర్షా(12) అనే బాలుడు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మధ్యలో ఒకరు ప్రాణాలు విడిచారు. చనిపోయిన మూడో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ప్రమాదం అనంతరం కోపోద్రిక్తులైన మృతుల కుటుంబసభ్యులు బస్సును తగలబెట్టేందుకు ప్రయత్నించారు. బస్సు ఇంజన్‌కు నిప్పుపెట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు బక్కెట్లతో నీళ్లుపోసి మంటలను అదుపుచేశారు. మృతుల బంధువులను అడ్డుకున్న పోలీసులు బస్సుకు నిప్పుపెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాలం చెల్లిన బస్సులను విజయవాడ రోడ్లపై నడుపుతున్నారని, ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆటాడుకుంటోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీని బస్సుకు అడ్డం పెట్టుండకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.