యాప్నగరం

కోడి కత్తి కేసు.. జగన్‌కు సిట్ నోటీసులు

జగన్‌కు నోటీసులు పంపిన సిట్.. కోడి కత్తి దాడి కేసులో వాంగ్మూలం ఇవ్వాలని కోరిన సిట్..

Samayam Telugu 19 Nov 2018, 8:15 pm
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగతోంది. ఈ కేసులో విశాఖ కోర్టు సమన్లు జారీ చేసి రెండు రోజులు కూడా గడకముందే.. జగన్‌కు మరో నోటీసు వచ్చింది. దాడికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలంటూ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. సోమవారం సాయంత్రం మరోసారి నోటీసులు పంపింది. వాంగ్మూలం కోసం గతంలోనే సిట్ ప్రయత్నించగా.. జగన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి నోటీసులు పంపారు.
Samayam Telugu jagan.


విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి తర్వాత పోలీసులకు జగన్ వాగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను ఏపీ పోలీసులు కలిసి వాగ్మూలం ఇవ్వాలని కోరారు. కాని తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. తర్వాత కూడా సిట్ వాంగ్మూలం కోసం ప్రయత్నాలు చేసింది. డీజీపీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. జగన్ వాంగ్మూలం ఇస్తేనే.. కేసు విచారణ త్వరగా పూర్తవుతుందన్నారు. అయినా ఆయన మాత్రం స్పందించలేదు.

తర్వాత ఈ నెల 17న (శనివారం) జగన్ మోహన్ రెడ్డికి విశాఖ కోర్టు సమన్లు జారీ చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై శ్రీనివాస రావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించి రక్తపు మరకలున్న చొక్కాను కోర్టుకు సమర్పించాలంటూ జగన్‌కు సమన్లు జారీ అయ్యాయి. దాడి ఘటనలో కీలక సాక్ష్యమైన షర్ట్‌ (చొక్కా)ను నవంబర్ 23 ఉదయం 11 గంటలలోపు అందజేయాలని విశాఖ ఏడో మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జగన్‌ను ఆదేశించింది.

వాంగ్మూలం సంగతి అలా ఉంటే.. కత్తి దాడిపై జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో కూడా.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్మకం లేదని.. పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతోందన్నారు. స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో కేసును విచారణ జరపించాలని కోరారు. మరి ఇలాంటి సందర్భంలో సిట్ నోటీసులపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.